ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనంపై ఊరేగిన శ్రీ మలయప్ప స్వామి
X
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శనివారం శ్రీ మలయప్పస్వామి చంద్రప్రభ వాహనంపై ఊరేగారు. నవనీత కృష్ణుడి అవతారంలో భక్తులను అనుగ్రహించారు. శివుని శిరోభూషణమైన చంద్రుడు ఈ రోజు శ్రీవారికి వాహనంగా మారడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. చంద్రప్రభ వాహనం ముందు కళాబృందాల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉంటే బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా సాగింది. ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.