Vasantha Panchami : నేడు వసంత పంచమి.. ముస్తాబైన దేవీ ఆలయాలు
X
నేడు సరస్వతి దేవీ జన్మతిథి పంచమిని పురస్కరించుకుని దేవీ ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. బుధవారం వివాహాలు, అక్షరాభ్యాసాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. చదువుల తల్లి సరస్వతి దేవి జన్మతిథి అయిన పంచమి కావడంతో ఈ రోజు భక్తులు ప్రత్యేకంగా తమ మొక్కులను చెల్లించుకోనున్నారు. సరస్వతీదేవిని మాఘ పంచమి రోజు శ్రీపంచమి పేరుతో ఆరాధించడం ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం.
వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచి విజ్ఞానవంతులు అవుతారని నమ్మకం. సరస్వతీ దేవి ఆరాధనతో వాక్‌శుద్ధి, జ్ఞానాభివృద్ధి, సత్‌బుద్ధి, మేథా సంపద, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ వంటి శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజు వాగీశ్వరీ, మహా సరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణా సరస్వతి, బాల సరస్వతి రూపాల్లో చదువుల తల్లి దర్శనం ఇస్తుంది.
సరస్వతి దేవీని తెల్లనిపూలతో పూజించడంతో సకల విద్యలు నేర్చుకుంటారని పురాణాల్లో ఉంది. ఇకపోతే ఈ రోజు గృహ, వివాహ కార్యాలకు అత్యంత అనుకూలమైన రోజు. వసంత పంచమి రోజు శుభముహూర్తాలు ఎక్కువ. దీంతో వందలాది వివాహాలు, గృహ ప్రవేశ కార్యక్రమాలు జరగనున్నాయి. దీంతో కళ్యాణమండపాలు వివాహాల సందడితో కిటకిటలాడితే, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోనున్నాయి.