Medaram jatara : మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచే స్పెషల్ బస్సులు
X
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మేడారం కు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. భక్తుల కోసం ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ బేస్ క్యాంపును మంత్రి సీతక్క శనివారం ప్రారంభించారు. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈరోజు నుంచి 26వ తేది వరకు 8 రోజుల పాటు ప్రత్యేక బస్సులను సంస్థ తిప్పుతున్నట్లు తెలిపారు. అమ్మవార్లను దర్శించుకుని తిరిగి గమ్యస్థానానికి చేరుకునే భక్తులు క్షేమంగా తమ తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్స్ ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 6 వేల బస్సులను మేడారానికి నడుపుతున్నామని, ఇందు కోసం దాదాపు 9 వేల మంది బస్ డ్రైవర్లను నియమించామని వివరించారు. దాదాపు 15 వేల మంది ఆర్టీసీ సిబ్బంది జాతర కోసం పని చేస్తున్నారని తెలిపారు. 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్‌తో కూడిన బేస్ క్యాంపును ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేకాదు బేస్ క్యాంప్ లో 7 కిలో మీటర్ల పొడవునా 50 క్యూ లైన్లను నిర్మించినట్లు వివరించారు.
రైల్వేశాఖ కూడా మేడారం భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మేడాకం జాతరకు సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ ట్రైన్లు నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. మేడారం జాతర సందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ స్పెషల్ ట్రైన్లు భక్తులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ ట్రైన్లు సికింద్రాబాద్-వరంగల్, నిజామాబాద్-వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్ మార్గంలో నడుస్తాయని అన్నారు. భువనగిరి, జనగాం, ఘన్‌పూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరు తదితర ప్రాంతాల్లోని భక్తులకు ఈ ట్రైన్లు ఉపయోగపడతాయన్నారు.
స్పెషల్ ట్రైన్ల వివరాలు..
సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్-సిర్పూర్ కాగజ్‌నగర్ (ట్రైన్ నెంబర్ 07017/07018)
సికింద్రాబాద్-వరంగల్-సికింద్రాబాద్ (ట్రైన్ నెంబర్ 07014/07015)
నిజామాబాద్-వరంగల్-నిజామాబాద్ (ట్రైన్ నెంబర్ 07019/07020 )