రాఖీ స్పెషల్..ఆర్టీసీ బంపర్ ఆఫర్..
X
రాఖీ పౌర్ణమి సందర్భంగా టీఎస్ఆర్టీసీ మహిళల కోసం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. పండుగ రోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు సర్ప్రైజ్ గిఫ్టులను అందించేందకు ప్లాన్ చేసింది. అందుకోసం ప్రత్యేకంగా రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించనుంది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన యువతులు, మహిళలకు రూ.5.50లక్షల విలువగల గిఫ్టులను అందించనుంది. ఏ ఒక్కరికో ఇద్దరికో అనుకుంటే పొరపాటే..ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురు చొప్పున మొత్తం 33 మందికి రఖీ స్పెషల్ గిఫ్టులను అందించి మహిళల పట్ల సంస్థకు ఉన్న గౌరవభావాన్ని తెలుపనుంది.
ఈ నెల 30, 31 తేదిల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయవచ్చు. తమ జర్నీ కంప్లీట్ కాగానే టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి..బస్టాండ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లలో వేయాల్సి ఉంటుంది. ఆ డ్రాప్ బాక్స్‌లు అన్నింటిని ఒకదగ్గరకు చేర్చి సెప్టెంబర్ 9న లక్కీ డ్రా తీస్తారు. ఒక్కో రీజియన్‌కు ముగ్గురు చొప్పున విజేతలను ఎంపిక చేసి వారికి గిఫ్టులను అందజేస్తారు.
రాఖీ సందర్భంగా టీఎస్ఆర్టీసీ అందిస్తున్న ఈ ఆఫర్ గురించి ఎండీ వీసీ సజ్జనార్ తన ట్వట్టర్ వేదికగా ప్రకటించారు. "యువతులకు, మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైంది. అత్యంత పవిత్రంగా ఈ పండుగను జరుపుకుంటారు. దూర ప్రాంతాలకు వెళ్లి మరీ తమ సోదరులకు రాఖీలు కడుతుంటారు. అందుకే సోదర సోదరీమణుల ఆత్మీయ, అనురాగాలతో కూడిన ఈ పండుగ రోజున..టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలను సంతోష పెట్టేందుకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది" అని సజ్జనార్ తెలిపారు.