శ్రీశైలంలో వేడుకగా రథోత్సవం.. పోటెత్తిన భక్తులు
X
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీశైలంలో రథోత్సవం వేడుకగా సాగింది. బ్రహ్మోత్సవాలల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని తిలకించేందుకు రెండు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. భక్తజనంతో పుర వీధులు నిండిపోయాయి. భ్రమరాంబ మల్లికార్జునుల కళ్యాణ మహోత్సవం తర్వాత రథంపై స్వామివారు ఊరేగారు. శనివారం అర్చకవేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు.
మంగళవాయిద్యాలు, ఢమరుకనాదాలతో అశేష భక్త జనం మధ్య రథోత్సవం వేడుకగా సాగింది. ఆలయ సాంప్రదాయం ప్రకారంగా రథాంగపూజ, హోమం, రథాంగబలి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి స్వామి అమ్మవార్లకు సాత్వికబలిని సమర్పించారు. రథోత్సవాన్ని వీక్షించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. గత రెండు రోజులుగా శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామిఅమ్మవార్లకు ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవాన్ని నయనానందకంగా నిర్వహించారు. విద్యుద్దీపాల అలంకరణ ఆకట్టుకుంది. వాటర్ ఫౌంటెయిన్‌లను వీక్షించిన యాత్రికులు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పుష్కరిణి వద్ద పుష్పాలంకరణ చేసిన తెప్పపై స్వామిఅమ్మవార్లు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.