Home > భక్తి > రేపే వైకుంఠ ఏకాదశి.. ప్రత్యేకతలేంటో తెలుసా..?

రేపే వైకుంఠ ఏకాదశి.. ప్రత్యేకతలేంటో తెలుసా..?

రేపే వైకుంఠ ఏకాదశి.. ప్రత్యేకతలేంటో తెలుసా..?
X

సూర్యుడు ఏటా దక్షిణయానం నుంచి ఉత్తరయానంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. పురాణాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెడతారని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున స్వర్గానికి మార్గం తెరచుకుంటాయని, ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసముంటే వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితాలొస్తాయని చాలా మంది విశ్వాసం.

మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతారు. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు ఈ ఏకాదశి వస్తుంది. ఆ రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులను దర్శనానికి పంపుతారు. ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని, అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు.

ఏకాదశి అంటే 11 అని అర్థం. అంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ ఉంచుకుని దీక్షను చేయడమే ఏకాదశి అంటారు. పురాణాల ప్రకారం, ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకుని గోడును వెళ్లబోసుకున్నారట. అప్పుడు శ్రీ మహా విష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి వారికి విముక్తి కలిగించారట. అందుకే ఉత్తర ద్వారం దర్శనంతో సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం.

వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. విష్ణుమూర్తి ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. పూజ చేసే సమయంలో తులసి, పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు. ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండటం కాదు. అనునిత్యం భగవంతుడిని స్మరించుకుంటూ ఉండటమే ఉపవాసం ఉద్దేశ్యం.

Updated : 22 Dec 2023 4:10 PM IST
Tags:    
Next Story
Share it
Top