Home > భక్తి > What Is Raksha Bandhan : పురాణాల్లో రాఖీ పండుగ ప్రస్తావన.. ఇంతకీ ఏం చెబుతున్నాయి..?

What Is Raksha Bandhan : పురాణాల్లో రాఖీ పండుగ ప్రస్తావన.. ఇంతకీ ఏం చెబుతున్నాయి..?

What Is Raksha Bandhan : పురాణాల్లో రాఖీ పండుగ ప్రస్తావన.. ఇంతకీ ఏం చెబుతున్నాయి..?
X

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీక రాఖీ పూర్ణమి. క్లిష్ట పరిస్థితుల్లో తనకు అండగా ఉంటాడని, అనుక్షణం కంటికి రెప్పలా కాపాడతారని ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మీయత, అనురాగాన్ని పంచే అన్నదమ్ముల ప్రేమను సెలబ్రేట్ చేసుకొనే రక్షాబంధన్ ఎంతో ప్రత్యేకమైంది. శ్రావణ పూర్ణిమ రోజుల జరుపుకునే ఈ రాఖీ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంతకీ రక్షా బంధన్ పండుగ ఎప్పుడు పుట్టింది. చరిత్రలో తొలిసారి ఎవరు రాఖీ కట్టారన్నదానిపై స్పష్టమైన ఆధారాల్లేకపోయినా పురాణాల్లో మాత్రం వీటి ప్రస్తావన ఉంది.

శచీదేవికి అండగా





పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు, రాక్షసులకు మధ్య దాదాపు 12 ఏండ్ల పాటు యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఇంద్రుని ఇంటిని ఓ రాక్షసి ఆక్రమించుకుందట. అప్పుడు ఇంద్రుని భార్య శచీదేవి సాయం కోసం శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి వేడుకుంటుంది. అప్పుడు ఇంద్రుడిని కాపాడటానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడట. ఆ తర్వాత శచీదేవి కోరిక మేరకు విష్ణుమూర్తి ఆ రాక్షసిని అంతమొందించాడట. అలా శచీదేవి రక్షా బంధన్ పండుగను ప్రారంభించగా.. ఈ రోజుకీ దాన్ని జరుపుకుంటున్నారని పురాణాలు చెబుతున్నాయి.

కృష్ణుడి గాయానికి కట్టు





మరో కథ ప్రకారం శ్రీ కృష్ణుడు శిశుపాలుడిని సంహరించేందుకు సుదర్శన చక్రాన్ని ఉపయోగించిన సమయంలో ఆయన చేతికి గాయం అవుతుంది. ఆ గాయాన్ని చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగు చించి కృష్ణుడి వేలికి చుట్టిందట. అలా వెంటనే స్పందించిన ద్రౌపదికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని శ్రీ కృష్ణుడు మాట ఇచ్చాడట. అలా ఆ రోజు ద్రౌపడి కట్టిన కట్టు ఆ తర్వాత రాఖీ పండుగకు నాంది పలికిందని పురాణాల్లో ఉంది. ఆ అనుబంధంతోనే కురు సభలో అవమానం ఎదుర్కొంటున్న ద్రౌపదికి కన్నయ్య అండగా నిలిచాడట.

సంతోషి మాత ఆవిర్భావం

మరో పురాణం ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజున గణేశుని సోదరి అయిన నాగ దేవత ఆయనకు ‘రక్ష’ కట్టడం చూసిన ఆయన పుత్రులు.. తమకు కూడా సోదరి కావాలని కోరారట. అప్పుడు గణేశుని కళ్ల నుంచి సంతోషి మాత ఆవిర్భావించిందని చెబుతారు. అవివాహితులు, పిల్లలు లేని జంటలు శ్రావణ పౌర్ణమి రోజున సంతోషిమాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ పవిత్రమైన రోజున రాఖీ కట్టించుకున్న వారికి సంతోషిమాత అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.




Updated : 28 Aug 2023 6:17 PM IST
Tags:    
Next Story
Share it
Top