వినాయక చవితి ఎప్పుడు?
X
ఈ ఏడాది వినాయక చవితిని భాద్రపద శుక్ల చతుర్థి అంటే సెప్టెంబర్ 18న నిర్వహించాలని తెలంగాణ విద్వత్సభ సూచించింది. సెప్టెంబర్ 18 నుంచే నవరాత్రులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రజలకు తెలిపింది. ప్రతి సంవత్సరం రాష్ట్ర సర్కార్ అన్ని పీఠాలకు శాస్త్రం ప్రకారం నిర్ణయించిన పండగల జాబితాను విద్వత్సభకు ఇస్తుంటుంది. అయితే వినాయక చవితిని సెప్టెంబర్ 18న చేసుకోవాలా? లేదా సెప్టెంబర్ 19న జరపాలా? అన్న దానిపై ప్రజల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ క్రమంలో వర్గల్‌లోని విద్యాసరస్వతి క్షేత్రంలో 100 మంది పండితుల సమక్షంలో వార్షిక విద్వత్సమ్మేళనంలో చర్చించి చవితి పండగపై ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్నిసర్కార్కు తెలిపింది.
మరోవైపు భాగ్యనగరంతో పాటు నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో వినాయక చవితి ఏర్పాట్లు, మండపాల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌తో సహా నగరం చుట్టుపక్కన 32వేల వరకు మండపాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అందుకే పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వినాయక చవితి ప్రారంభమైనప్పటి నుంచి నిమజ్జనం జరిగే వరకు బందోబస్తు ఉంటుందని తెలిపారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల పోలీసుల సాయం తీసుకుంటామని తెలిపారు.
అయితే, చవితికి ఇంకా సమయం ఉండటంతో అధికారికంగా పండుగ ఎప్పుడు చేసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.