Home > దసరా 2020 > రాజ్యసభకు రేణుకా చౌదరి.. కారణం అదేనా..?

రాజ్యసభకు రేణుకా చౌదరి.. కారణం అదేనా..?

రాజ్యసభకు రేణుకా చౌదరి.. కారణం అదేనా..?
X

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు రేణుకా చౌద‌రి పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ద‌క్క‌ే రెండు రాజ్య‌స‌భ సీట్ల‌లో ఒక‌టి రేణుకాచౌద‌రికి కేటాయిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి బరిలో దిగాలని రేణుకా చౌదరి భావించారు. అయితే అధిష్టానం మాత్రం అనూహ్యంగా ఆమెను పెద్దల సభకు పంపాలని డిసైడైంది.

నిజానికి ఖమ్మం లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ ఆశావ‌హులు ఎక్కువ‌గా ఉన్నారు. గెలుపు గ్యారెంటీ సీటు కావ‌డంతో చాలా మంది అక్కడి నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి సైతం ఖమ్మం లోక్సభ టికెట్పై ఆశ పెట్టుకున్నారు. కానీ హైకమాండ్ మాత్రం ఆమె స్థానంలో కొత్తవారికి అవకాశమివ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతోంది. అందుకే ఈసారి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. సామాజికపరంగానే కాకుండా ఆర్థికంగా బలమైన నేతను ఎంపిక చేయాలని హైకమాండ్ నుంచి రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈ క్రమంలో రేసులో ఉన్న రేణుకా చౌదరిని రాజ్య‌స‌భ‌కు పంపడమే ఉత్తమమని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వాటిలో తొమ్మిదింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గత ఎన్నికలను పరిశీలిస్తే ఖమ్మం ఎంపీ సీటును ఎక్కువసార్లు కాంగ్రెస్ అభ్యర్థులే సొంతం చేసుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి 1999, 2004లో ఖమ్మం ఎంపీగా గెలుపొందారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 2009లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలవడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆమెను రాజ్యసభకు పంపింది. 2014 ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉండగా.. అప్పట్లో వైసీపీ అభ్యర్థి గెలిచారు. 2019 ఎన్నికల్లో మరోసారి నామా నాగేశ్వరరావుపై పోటీ చేసినా రేణుకకు ఓటమి తప్పలేదు. ఈసారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థి నామా, కాంగ్రెస్ నుంచి రేణుక మధ్య పోటీ జరిగితే సీన్ రిపీట్ అవుతుందని జిల్లా నేతలు పార్టీ హైకమాండ్కు వివరించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలకమైన నేతలతో రేణుకా చౌదరికి సయోధ్య లేదు. ఓ నేతకు వ్యతిరేకంగా పనిచేయడంతో పాటు కాంగ్రెస్ లో ప్రస్తుతం కీలక పదవిలో ఉన్న మరో నేత సైతం ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వవద్దని అభ్యంతరం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. క్యాడర్ సైతం ఆమెకు సహకరించే పరిస్థితి లేదని హైకమాండ్కు కొందరు ఫిర్యాదులు చేయడంతో పార్టీ అధిష్ఠానం రేణుకను పెద్దల సభకు పంపడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రేణుకా చౌదరి టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాజకీయాల్లో ఎంతటి వారిపైనైనా విమ‌ర్శ చేయగల నాయ‌కురాలిగా గుర్తింపు పొందారు. త‌న సామాజిక వ‌ర్గం ప్ర‌యోజ‌నాల కోసం పోరాటంలో ముందుండే రేణుకా చౌదరి.. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వంపై ప‌లుమార్లు విమ‌ర్శ‌లు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే ఏపీలో పోటీకి సిద్ధమని ఇటీవలే ప్రకటించారు. ఏపీ ఎన్నికల్లో ప్రచారానికి రెడీ అని స్పష్టం చేశారు.

Updated : 14 Feb 2024 6:40 PM IST
Tags:    
Next Story
Share it
Top