రేపే గ్రూప్-4 పరీక్ష.. ఆ స్కూళ్లు, కాలేజీలకు సెలవు
ఆ పరీక్షా కేంద్రాలకు మాత్రమే
X
రేపు(జూలై 1న ) జరగబోయే 'గ్రూప్-4' పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేయగా.. మొత్తం 40 వేల గదుల్లో అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 హాల్‌టికెట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పేపర్-1 (జనరల్ స్టడీస్) పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ప్రతీ పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు పరీక్షకేంద్రం గేట్లు మూసివేస్తారు.
మరోవైపు పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లు, కాలేజీలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. ఈ క్రమంలో జూలై 8 రెండో శనివారం రోజును వర్కింగ్ డే ప్రకటించింది. ఇక పరీక్ష రాయబోయే అభ్యర్థుల రవాణా సౌకర్యం కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఉంటాయని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.గ్రేటర్ జోన్ పరిధి ఈడీ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు.