Chandrayan-3: జాబిల్లి కోసం ఆకాశమంతా వేచేను....
X
ఎవ్వరికీ అందని జాబిల్లిని సొంతం చేసుకునేందుకు భారత్ పయనమవుతోంది. చంద్రుడిలోని దక్షిణ దిక్కు మీద అడుగుపెట్టేందుకు ఈరోజే బయలుదేరుతోంది. లక్ష్యం కోసం అలుపెరుగని పోరాటాన్ని మొదలుపెడుతోంది. మరో కొన్ని గంటల్లో నిప్పులు చిమ్మకుంటూ భారత అంతరిక్షనౌక నింగిలోకి ఎగరబోతోంది.
లక్ష్యాలు ఎప్పుడూ పెద్దవిగా ఉండాలని చెబుతారు. అందరూ చేసిన పని మనమూ చేస్తే మన ప్రత్యేకత ఏముంటుందని మాయాబజార్ సినిమాలో ఓ డైలాగ్. అచ్చు అలాగే అనుకుంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. అందుకే చంద్రునిలో కుందేలును అందుకోవడానికి చేతులు జాస్తోంది. వెలుగుల మామలో దక్షిణ భాగాన్ని ముద్దాడడానికి పయనమవుతోంది. చంద్రయాన్ -2 తో మిగిలిన చేదు జ్ఞాపకాలను చెరిపేసుకోవడానికి సిద్ధమయింది. దాంతో పాటూ చిరకాల వాంఛను ఎలాగైనా నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉంది. భారత లక్ష్యసిద్ధిని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ వెయ్యి కళ్ళు పెట్టుకుని చూస్తున్నాయి. మనవాళ్ళయితే సక్సెస్ కొట్టి తలెగరెయ్యాలని తెగ ఉవ్విళ్ళూరుతున్నారు.
చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించే చంద్రయాన్-3 ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ వేదిక కానుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ గురువారం మధ్నాహ్నం అంటే నిన్న 1.05 గంటలకు ప్రారంభమైంది. సరిగ్గ 25 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ తర్వాత రాకెట్ ఎల్‌వీఎం3-ఎం4 శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్-3తో నింగిలోకి దూసుకెళ్ళనుంది. మొదట 24 గంటల కౌంట్‌డౌన్‌తో ప్రారంభించాలని శాస్త్రవేత్తలు భావించారు. కానీ, స్వల్పమార్పులు చేసి కౌంట్‌డౌన్‌ను 25.30 గంటలకు పెంచి ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ రాకెట్ ద్వారా 3,900 కిలోల బరువున్న చంద్రయాన్-3 పేలోడ్‌ను రోదసీలోకి పంపనున్నారు. ఇందులో రాకెట్ నుంచి విడిపోయాక స్సేస్ షటిల్ ను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్య వరకూ మోసుకెళ్ళే ప్రొపల్షన్ మాడ్యూల్, అక్కడి నుంచి చంద్రుని మీద దిగిన తర్వాత పరిశోధనలు చేసేందుకు విక్రమ్ ల్యాండర్, ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్ రోవర్ లు ఉన్నాయి. ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ బుధవారం నుంచి షార్ లోనే ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
ప్రస్తుత ప్రయోగ లక్ష్యం చంద్రున్ని లోతుగా పరిశీలించడమే. దక్షిణ భాగంలో ఉన్న రహస్యాలను వెలికితీయడమే ప్రధాన ఉద్దేశ్యం. దక్షిణ భాగం మనకు కనిపించే చంద్రునికి వెనుకవైపు ఉంటుంది. ఈ భాగంలో సూర్యుడు పడడు. అందుకే ఇది ఎప్పుడూ చీకటిగా ఉంటుంది. చంద్రయాన్ -3 వలన భవిష్యత్తులో అక్కడ నివాసం ఉండవచ్చునో లేదో పరిశీలించనున్నారు. దానితో పాటూ మందమామ మీద నిత్యం జరిగే మార్పులను కూడా గుర్తించి భూమికి పంపించనున్నారు. దీనికోసం ప్రొపల్షన్ మాడ్యూల్ లో ఓ పరికరాన్ని అమర్చారు. ఇక రోవర్ లో మూడు పేలోడ్లను పంపుతున్నారు. ఇందులో లాంగ్ మ్యాయిన్ ప్రోబ్ చంద్రుడి ఉపరితలం మీద ప్లాస్మా, అయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రత కాలంతో పాటూ మారుతుందా లేదా అనే అంశాన్ని పరిశోధించనున్నారు.
భూమికి 3.84 లక్షల కి.మీల దూరంలో ఉన్న చంద్ర మండలాన్ని చేరుకొనేందుకు ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్.... చంద్రయాన్-3ను తొలుత 100 కిలోమీటర్ల ఎత్తులోని భూకక్ష్యలోకి చేర్చుతుంది. ఆ తర్వాత రాకెట్ నుంచి చంద్రయాన్-3 విడిపోతుంది. ప్రొపల్షన్ మాడ్యూల్ భూకక్ష్యలోనే 24 రోజులపాటు తిరిగిన తర్వాత చంద్ర కక్ష్యవైపు ప్రయాణిస్తుంది. చంద్రుడికి 30 కిమీల దూరంలో ప్రొపల్షన్ లోని ల్యాండర్ విడిపోయి దక్షిణ ధ్రువం వైపు దిగుతుంది. అన్నీ సజావుగా సాగితే ఆగస్టు 23 లేదా 24న చంద్రయాన్-3లోని ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగుతుంది. దాని తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుని మీద 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుంది. ఇది విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తర్వాత చంద్రునిపై ల్యాండర్‌ను దింపిన దేశంగా భారత్ రికార్డు సృష్టిస్తుంది.
Veerendra Prasad
వీరేందర్ మైక్ టీవీ వెబ్‌సైట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్(సబ్ ఎడిటర్)గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో(V6, T News) రాజకీయం, లైఫ్ స్టైల్, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.