Health Update : రాష్ట్రంలో డేంజర్ బెల్స్.. విజృంభిస్తోన్న డెంగీ.. ఈ జిల్లాల్లోనే అధికం
X
రాష్ట్రంలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది జులై ఆఖరు నాటికి 961 నమోదు కాగా ఆగస్టు నెలలోనే 200 మందికి పైగా డెంగీ బారిన పడ్డట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒకే వారంలో 120 డెంగీ కేసులు నమోదయ్యాయి. అయితే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే డెంగీ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ప్రైవేట్ ఆసుపత్రులలో నమోదవుతున్న కేసులు చాలా వరకు ప్రభుత్వం దృష్టికి రావడం లేదని అధికారులు అంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డెంగీ కారక దోమ వృద్ధి చెందడంతో గత నెల నుంచి కేసులు భారీగా పెరిగాయి.
కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ ఏడాది ఇప్పటి వరకు 168 కేసులు వచ్చాయి. అక్కడ ప్రైవేటు ఆసుపత్రులకూ తాకిడి ఎక్కువగానే ఉంటోంది. ఖమ్మం జిల్లాలో ఆగస్టులో 61 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ఈ జిల్లాలో గత ఐదు రోజుల్లోనే 23 కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం ఒక్కరోజే 14 కేసులు నమోదయ్యాయి. ముందుముందు కేసుల సంఖ్య బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఏజెన్సీతో ముడిపడి ఉన్న డీఎంహెచ్‌వో తెలిపారు.
పెద్దపల్లి జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువకుడు తీవ్ర జ్వరంతో బాధపడుతూ మృతి చెందారు. డెంగీ లక్షణాలతోనే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అయితే డెంగీ లక్షణాలు వస్తే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్లు, కండరాలు, కీళ్ల నొప్పులు ఉండటం.. రుచి కోల్పోవడం, జలుబు, వాంతులు వంటివి డెంగీ లక్షణాలని అంటున్నారు. డెంగీని ప్రారంభ దశలోనే గుర్తిస్తే త్వరగా నయం కావడమే కాకుండా తక్కువ ఖర్చుతో బయటపడే అవకాశం ఉందని చెప్పారు. ఒకవేళ ఇది ముదిరితే.. ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయి ప్రాణాంతకంగా మారుతుందని చెప్పారు.