తక్కువ రేట్ల మందులే రాయాలి..డాక్టర్లకు కేంద్రం వార్నింగ్
X
పేదవాడికి వైద్యం భారంగా మారుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తున్నప్పటికీ..అక్కడి పరిస్థితులు దృష్ట్యా ప్రైవేట్ ఆస్పత్రులను తప్పక ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు వైద్యులు డబ్బులు పిండేస్తున్నారు. అవసరం లేని మెడిసన్ రాస్తుండడంతో జేబులు గుల్లు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై పేషెంట్లకు జనరిక్ మందులనే రాయాలని తెలిపింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2002లో భారత వైద్య మండలి (IMC) జారీ చేసిన నిబంధనల ప్రకారం దేశంలోని ప్రతి వైద్యుడు జనరిక్ మందులు రాయాలనే సూచనలు ఉన్నాయి. అయితే దీనికి భిన్నంగా వ్యవహరించే వైద్యులపై ఎలాంటి చర్యలను అందులో పేర్కొనలేదు. దీంతో వాటిని ప్రైవేట్ వైద్యులు పెద్దగా పాటించడం లేదు. అయితే తాజాగా నేషనల్ మెడికల్ కమిషన్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్స్ (NMCRMP) పేరుతో జారీ చేసిన కొత్త నిబంధనల్లో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు తక్కువంగా దొరికే జనరిక్ ఔషధాలు రాయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. అవసరమైతే వారి లైసెన్సును కూడా సస్పెండ్ చేస్తామని తెలిపింది. అదే విధంగా వైద్యులు రాసే మందుల చీటీలో ఔషధాల పేర్లను క్యాపిటల్ అక్షరాల్లో రాయాలని జాతీయ వైద్య కమిషన్ ఆ నిబంధనల్లో పేర్కొంది.
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు వైద్యం కోసం అధికంగా ఖర్చు చేస్తున్నారు. మార్కెట్లో తక్కువ రేట్లు ఉన్న జనరిక్ మందులను వైద్యులు రాయడంతో పేషెంట్ల ఖర్చులను తగ్గించువచ్చు. ఇలా చేయడం ద్వారా అందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించినట్లవుతుంది" అని ఎన్‌ఎంసీ తమ నిబంధనల్లో పేర్కొంది.