PNEUMONIA : పెరుగుతున్న న్యుమోనియా కేసులు..తల్లులు తస్మాత్ జాగ్రత్త
X
వాతావరణంలో మార్పుల కారణంగా చిన్నారులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా న్యుమోనియా వంటి అనారోగ్య సమస్యలు చిన్నారులను ఇబ్బంది పెడుతున్నాయి. విపరీతమైన దగ్గు, జ్వరం, జలుబుతో పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించింది కరోనా వైరస్. ఈ మహమ్మారి ఇప్పటికీ పరోక్షంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రజలు కొవిడ్ కనుమరుగైపోయిందని భావిస్తున్నారు. ఈ క్రమంలో చాపకింద నీరులా ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడేలా భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఒక్కరోజే దేశవ్యాప్తంగా 166 కొత్త కేసులు బయటపడ్డాయి. చాలా రోజుల తర్వాత ఇంతటి స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో ప్రజలు మరోసారి ఆందోళనకు గురవుతున్నారు. జనాల్లో కొత్త భయాలు మొదలయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం..దేశంలో ఒక్కరోజే 166 కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. అందులోనూ అత్యధిక కేసులు కేరళలో నమోదు కావడం గమనార్హం. ఈ కొత్త కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంతో 895 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు సమాచారం. శీతాకాలం కావడంతో ఇన్‌ఫ్లూయెంజా వంటి వైరస్‌ల కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4.44 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. అందులో 5,33,306 మంది ఈ మహమ్మారితో పోరాడి ప్రాణాలను విడిచారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ మరణాల రేటు 1.19 శాతం ఉంది. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం 220.67 కోట్ల కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసింది. ఇక వాతావరణంలో మార్పుల కారణంగా చాలా మంది జ్వరాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చలి గాలులు, చల్లని వాతావరణంతో.. చిన్నారుల్లో శ్వాసకోశ సమస్యలు అధికమవుతున్నాయి. ఆస్తమా, న్యుమోనియా కేసులు పెరిగిపోతున్నాయి. జలుబు, విపరీతమైన దగ్గు, జ్వరం, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులు చికిత్స నిమిత్తం హాస్పిటల్స్‌లో చేరుతున్నారు. 5-6 రోజులైనా జ్వరం తగ్గక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం న్యుమోనియా కింద గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. న్యుమోనియా సింప్టమ్స్ కనిపించిన వెంటనే డాక్టర్ ని సంప్రదించాలని చెబుతున్నారు. సొంతంగా యాంటిబయోటిక్స్ వాడకూడదని సూచిస్తున్నారు. శీతాకాలంలో న్యుమోనియా కేసులు ఎక్కువగా ఉంటాయంటున్నారు వైద్యులు. కాబట్టి చిన్నారులు వెచ్చని వాతావరణంలో ఉండే విధంగా రక్షణ కల్పించాలని సూచిస్తున్నారు. చలిలో పిల్లలను బయటకు తీసుకెళ్లడం, తలుపులు, కిటికీలు ఎప్పటికీ తెరిచి ఉంచటం వల్ల న్యుమోనియా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ చల్లని వాతావరణంలో ముఖ్యంగా చంటి పిల్లల సంరక్షణలో కంగారూ మదర్ కేర్ కీలకమని వైద్యులు చెబుతున్నారు. కంగారు తన పిల్లలను కడుపు దగ్గర ఉన్న సంచిలో పెట్టుకున్నట్లుగా చంటి పిల్లలు ఉన్న తల్లులు కూడా తమ బిడ్డలను ఛాతీపై పడుకోబెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మదర్ బాడీ టెంపరేచర్ చిన్నారిని కాపాడుతుందని అంటున్నారు. అంతే కాదు చిన్నారికి తల్లిపాలు సక్రమంగా అంది బరువు పెరిగి ఇన్‌ఫెక్షన్లకు దూరంగా ఉంటారని చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు పిల్లలను ఎక్కువ సమయం కంగారూ మదర్‌కేర్‌లో ఉంచాలని చెబుతున్నారు.
న్యుమోనియా లంగ్స్‌ను ప్రభావితం చేసే బ్రీతింగ్ ప్రాబ్లమ్. అంతే కాదు న్యుమోనియా అనేక రకాల ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. సెకండరీ ఇన్ఫెక్షన్స్‌తో వచ్చే న్యుమోనియా ఒక్కోసారి డేంజరస్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఒకే చోటు ఎక్కువ మంది గుమికూడదు. వీలైనంత వరకు ఓవర్ క్రౌడింగ్ కి దూరంగా ఉండాలి. పొగ వాతావరణానికి ఎక్స్‌పొజ్ కాకుండా ఆస్తమా, బ్రాంకైటిస్ బాధితులు ఉండాలి. అలాగే స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లకు దూరంగా ఉండాలి. డ్రింక్ చేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది, తద్వారా న్యుమోనియా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా అన్ని పోషకాలు ఉండే సమతుల్యమైన ఆహారం తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల నిమోనియా మాత్రమే కాకుండా ఇతర ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.