ఉప్పు అతిగా తింటున్నారా..? వైద్యుల హెచ్చరిక ఏంటంటే..
X
ఉప్పు లేకపోతే ఎంత గొప్ప వంటైనా రుచిగా ఉండదు. ఎందుకంటే వంటకాలకు రుచిని అందించేది చిటికెడంత ఉప్పే కాబట్టి. అయితే, కూరలో కాస్తంత సాల్ట్ ఎక్కువైతే.. దాని టేస్ట్ మొత్తం ఎలాగైతే పోతుందో. మన ఆరోగ్యం విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. మానవ శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్, నరాల పనితీరు, మజిల్ కాంట్రాక్షన్ని నిర్వహించడానికి ఉప్పు చాలా అవసరం. అయితే అతిగా ఉప్పు తీసుకోవడం వల్ల మన హెల్త్‌పై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. రక్తపోటు పెరుగుతుంది. అంతే కాదు గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. వంటకాల్లో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్, ఎముకలు బలహీనపడటంతో పాటు అధికంగా దాహం వేయడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఉప్పును మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. మరి ఉప్పు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం.
ఉప్పు అధికంగా తీసుకుంటే ముప్పే :
డాక్టర్ల దగ్గరకు వెళ్లిన ప్రతిసారీ ఆహారంలో ఉప్పు తగ్గించమని చెబుతుంటారు. వయసు పైబడినవారు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల బీపీతో పాటు గుండె సంబంధిత సమస్యల రిస్క్ పెరుగుతుందని చెబుతారు. అయితే తాజా అధ్యయనాల ప్రకారం ఉప్పును అధికంగా తినడం వల్ల పొట్ట సంబంధిత క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి రోజూ 10 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును తీసుకోవడం వల్ల స్టమక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఒక జపనీస్ అధ్యయనం హెచ్చరిస్తోంది. దీనిపై మరింత అవగాహన పెంచుకోవడానికి శాస్త్రవేత్తలు ఈ మధ్యనే ఎలుకలపై ఒక అధ్యయనం కూడా నిర్వహించారు. ఈ స్టడీ ప్రకారం.. సాల్ట్ అధికంగా తీసుకోవడం కారణంగా కడుపులోని పొర మారుతోందని శాస్త్రవేత్తలు గమనించారు. అలాగే ఇది క్యాన్సర్‌కు దారితీస్తోందని గుర్తించారు. దీనిని అనుసరించి జపాన్, చైనా, యునైటెడ్ స్టేట్స్, స్పెయిన్ లు నిర్వహించిన అధ్యయనాలు ఉప్పు తినడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిర్ధారించాయి.
కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది :
సాధారణంగా ఆహారంలో 4-6 గ్రాముల వరకు ఉప్పును వినియోగిస్తారు. అంతకంటే ఎక్కువ అయితే ఫుడ్ టేస్ట్ మారుతుంది. కానీ పచ్చళ్లు, సాల్టెడ్ చిప్స్, సాల్టెడ్ వేరుశెనగ, ప్రాసెస్డ్ మీట్ వంటి ఆహారాల్లో ఉప్పు లిమిట్కి మించి ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల రోజుకు 16 గ్రాముల వరకు ఉప్పును తీసుకున్నట్లు అవుతుంది. ఇలా లిమిట్ కి మించి ఉప్పు తీసుకుంటే కడుపులో గ్యాస్ట్రిక్ మ్యూకోసా అని పిలిచే గ్యాస్ట్రిక్ పొరను నాశనం చేస్తుంది. దీనినే పేగు మెటాప్లాసియా అంటారు. అదే విధంగా కడుపులో హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా పెరిగి కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే నిల్వ పచ్చళ్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తినకూడదు. అలాగే రోజువారీ ఉప్పును 6 గ్రాముల కంటే తక్కువగానే తీసుకోవాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులే కాదు కడుపు క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.