Home > ఆరోగ్యం > Avoid Alcohol : మద్యం ఎంత తాగితే ఒంటికి మంచిది డాక్టర్లు ఏం చెబుతున్నారు

Avoid Alcohol : మద్యం ఎంత తాగితే ఒంటికి మంచిది డాక్టర్లు ఏం చెబుతున్నారు

Avoid Alcohol : మద్యం ఎంత తాగితే ఒంటికి  మంచిది డాక్టర్లు ఏం చెబుతున్నారు
X

తినేదైనా, తాగేదైనా... ప్రతిదానికీ ఒక లిమిట్ అంటూ ఉంటుంది. అతిగా ఏం తిన్నా, తాగినా అనారోగ్య సమస్యలు వస్తాయనడం వాస్తవం. ఇక ఆల్కహాల్ విషయంలో కాస్త జాగ్రత్త ఎక్కువగానే ఉండాలంటారు నిపుణులు.

పరిమితికి మించి మందు తాగే అలవాటు కోలుకోలేని అనారోగ్యాలు, వ్యాధులకు కారణం అవుతాయంటున్నారు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం, కడుపు, గుండె, మెదడు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది క్యాన్సర్ రిస్క్‎ను సైతం పెంచుతుంది. ఒక్కోసారి మద్యపానం ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది. మరి వాస్తవానికి మందు తాగాలా? వొద్దా? తాగాలంటే ఎంత తాగాలి? మందు తాగడం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుత కాలంలో ఆల్కహాల్ తాగనివారు చాలా తక్కువ మంది ఉంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువతలో మద్యం సేవించే ట్రెండ్ పెరుగుతోంది. పండుగలని, వేడుకలని,చుట్టాలు వచ్చారని, బంధువులు పోయారని , గర్ల్ ఫ్రెండ్ నో చెప్పిందని, ఆఫీస్ టెన్షనని, అప్పుల బాధలని ఇలా మందు తాగడానికి మందు బాబులు వంద కారణాలు వెతుక్కుంటున్నారు. ఇక కొంతమంది సమయం సందర్భం లేకుండా మందు తాగుతుంటారు. ఇక రోజూ మద్యపానానికి బానిసలైన వారు చాలా మందే ఉన్నారు. మద్యం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నప్పటికీ చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ అతిగా మద్యం సేవిస్తుంటారు. క్యాన్సర్ తో సహా అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలబారిన పడుతుంటారు. ఈ క్రమంలో మందుబాబుల మదిలో వచ్చే అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, రోజుకు ఎంత మద్యం తాగడం సురక్షితం? అని. కొందరు రోజుకు 1-2 పెగ్గుల మందు తాగడం ఆరోగ్యానికి హానికరం కాదని చెబుతుంటే మరికొంతమంది 3-4 పెగ్గులు తాగినా ఏమీ కాదని నమ్ముతారు. నిజానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం, ఒక్క చుక్క ఆల్కహాల్ కూడా ఆరోగ్యానికి సురక్షితం కాదని చెబుతుంది. అతి తక్కువ మొత్తంలో వైన్ లేదా ఇతర మద్య పానీయాలు సేవించినా ప్రమాదమని సూచిస్తోంది. ఆల్కహాల్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల క్యాన్సర్, కాలేయ వైఫల్యంతో సహా అనేక అనారోగ్య సమస్యల రిస్క్ ని పెంచుతుందని నివేదికలు చెబుతున్నాయి. మందు ఆరోగ్యానికి మంచిదని ప్రజలు భావించడం పూర్తిగా అపోహ మాత్రమేనని తేల్చేశాయి.

మన శరీరంలో మెదడు తర్వాత ముఖ్యమైన భాగం లివర్‌. జీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని వడపోయడమే దీని ముఖ్యమైన పని. శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, రక్తంలోని షుగర్ లెవెల్స్ ని కూడా లివర్‌ కంట్రోల్ లో ఉంచుతుంది. కొవ్వును తగ్గించడంలో, కార్బోహైడ్రేట్లను నిల్వ చేయడంలో, ప్రోటీన్లను తయారు చేయడంలోనై ఇది హెల్ప్ చేస్తుంది. లివర్ దాదాపుగా మన శరీరంలో 500 రకాలకు పైగా క్రియలను నిర్వర్తిస్తుంది. కానీ లివర్‌ ఆరోగ్యాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రస్తుతం ఎంతోమంది ఫ్యాటీ లివర్‌ ప్రాబ్లమ్‎తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో లంగ్స్ డ్యామేజ్ అవ్వడానికి ప్రధానంగా మద్యపానమే కారణమంటున్నారు వైద్యులు . ఆల్కహాల్ తీసుకునే వారు చాలా తక్కువ క్వాంటిటీలో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం యువత వారంలో ఒకసారే మద్యం తాగుతామని చెబుతుంటారు. అయితే వారానికి ఒకసారి తాగినా పరిమితికి మించి ఎక్కువగా తాగేస్తుంటారు. ఇది చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్లు. అలాగని కొద్ది కొద్దిగా రోజూ మద్యం తీసుకున్నా ప్రమాదమేనని చెబుతున్నారు. అదే విధంగా ఒకేసారి ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే. అందుకే మందు తాగేవారు రెండు వారాలకు ఒకసారి 60 ఎంఎల్ మాత్రమే తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

అతిగా తాగడం వల్ల ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది. ఇది రాను రాను విషతుల్యంగా మారుతుంది. ఇక అసలు మందు తాగని వారిలో ఈ సమస్య వస్తే..దానిని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఎక్కువ శాతం ఆయిల్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, వెస్ట్రన్ ఫుడ్ తీసుకునే వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. అధిక బరువు, డయాబెటిస్‌ ఉన్నవారికి ఫ్యాటీ లివర్‌ సమస్య వచ్చే రిస్క్ ఎక్కువే. దీనికి తీసుకునే ఆహారం, జీవన విధానంలో మార్పులే కారణమంటున్నారు వైద్యులు. స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోవడం, సిట్టింగ్ జాబ్స్ చేయడం, వ్యాయామం లేకపోవడం , ఆడుకోవడం మరిచిపోవడం వల్ల చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఈ నాన్ ఆల్కహాలిక్ సమస్య కనిపిస్తుంది. రానున్న పది సంవత్సరాల్లో ఈ సమస్యతో బాధపడేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇఫ్పుడే మేల్కొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Updated : 18 Jan 2024 2:07 PM IST
Tags:    
Next Story
Share it
Top