ఉమ్మితో ప్రెగ్నెన్సీ టెస్ట్..5 నిమిషాల్లో రిజల్ట్
X
మారుతున్నకాలానికి అనుగుణంగా వైద్య రంగంలోనూ అనేక మార్పులు వస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని అనేక వినూత్నమైన, విప్లవాత్మకమైన ప్రయోగాలకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుడుతున్నారు. సమాన్యులు సైతం సులువుగా వైద్య సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సరికొత్త టెస్టింగ్ టూల్స్‌ను యూజర్ ఫ్రెండ్లీగా లాంచ్ చేస్తున్నారు. తాజాగా గర్భనిర్ధారణ కోసం సరికొత్త కిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ కర్ఫర్మేషన్ కోసం డాక్టర్లు యూరిన్ టెస్ట్ చేయించుకుని రమ్మనేవారు లేదా మహిళలు యూరిన్ బేస్డ్ కిట్స్‌ను వాడేవారు. కానీ ఇకపై ఆ ఇబ్బంది ఏమీ లేకుండా ఉమ్మితోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే హోంటెస్ట్ కిట్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. త్వరలోనే వరల్డ్ వైడ్‌గా ఈ టెస్టింగ్ కిట్స్ వినియోగంలోకి రానున్నాయి.
ఉమ్మితో గర్భనిర్ధారణ పరీక్షలు చేసుకునే సాలిస్టిక్ కిట్లను జరూసలెంకు చెందిన సాలిగ్నోస్టిక్స్ అనే బయోటెక్ స్టార్టప్ కంపెనీ రూపొందింది. ఈ కిట్ల రూపకల్పనకు సంస్థ ఏడాది పాటు శ్రమించింది. కరోనా టెస్టింగ్ కిట్స్‌కు వినియోగించిన సాంకేతికత ఆధారంగా వీటిని రూపొందించడం గమనార్హం. తాజాగా యూకే ప్రజలకు ఈ కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐర్లాండ్‌లోనూ ఈ గర్భ నిర్ధారణ కిట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. యూఎస్‌లోనూ విక్రయాలు చేపట్టేందుకు సంస్థ అనుమతి కోసం ఇప్పటికే ఎఫ్‌డీఏకు అప్లై చేసింది.
సాలిస్టిక్ కిట్లను ఎంతో సులువుగా వినియోగించుకోవచ్చు. వీటిని ఎప్పుడైనా..ఎక్కడైనా వాడొచ్చు. జ్వరం వస్తే టెంపరేచర్ ను థెర్మామీటర్‌తో చెక్ చేసుకున్నట్లే ఈ కిట్‌లో వచ్చే స్టిక్‌ను నోట్లో అలా 5 నిమిషాలు పెట్టుకుంటే చాలు రిజల్ట్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు మూడు నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తుంది.