Home > హైదరాబాద్ > హైదరాబాద్‌లో అమ్మోనియా గ్యాస్‌ లీక్.. 15 మందికి అస్వస్థత

హైదరాబాద్‌లో అమ్మోనియా గ్యాస్‌ లీక్.. 15 మందికి అస్వస్థత

హైదరాబాద్‌లో అమ్మోనియా గ్యాస్‌ లీక్.. 15 మందికి అస్వస్థత
X

హైదరాబాద్‌లో అమ్మోనియా గ్యాస్‌ లీకేజీ వ్యవహారం కలకలం రేపింది. సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఫతేనగర్‌లో చాలా కాలంగా చెత్తకుప్పల్లో పడివున్న సిలిండర్ల నుంచి గ్యాస్ లీక్ కావడంతో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 15 మీటర్లకు పైగా గ్యాస్ వ్యాపించడంతో ఆ గాలిని పీల్చి ఊపిరాడక, వాంతులు, కళ్ల మంటలతో బస్తీవాసులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్యాస్‌ లీకైన ప్రాంతంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కూడా ఉండటంతో బస్తీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఫతేనగర్‌లోని పైప్‌లైన్‌ రోడ్డు చివర్లో చెత్తకుప్పల్లో రెండు అమ్మోనియా గ్యాస్‌ సిలిండర్లు చాలా కాలం నుంచి పడి ఉన్నాయి. వీటిని గమనించిన ఓ దొంగ గురువారం సాయంత్రం గ్యాస్‌ సిలిండర్లకు ఉన్న ఇత్తడి వాల్వ్‌లు దొంగిలించేందుకు ప్రయత్నించాడు. రాడ్డుతో వాల్వ్‏లను కొట్టి తొలగించబోయాడు. దీంతో ఒక్కసారిగా సిలిండర్ల నుంచి పెద్ద ఎత్తున అమ్మోనియా గ్యాస్‌ ఎగిసిపడింది. భయపడిన దొంగ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. గ్యాస్ వెంటనే 15 మీటర్ల వరకు పొగలా వ్యాపించింది. అక్కడే ఉన్న ఓ కంపెనీలో పనిచేస్తున్న పది మంది బీహారీ కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారితో పాటే బస్తీలో ఉంటున్న మరో ఐదుగురు వాంతులు, కళ్ల మంటలతో బాధపడ్డారు. స్థానికులు హుటాహుటిన బాధితులను బాలానగర్‌లోని బీబీఆర్‌ ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఆ సిలిండర్లు అక్కడకు ఎవరు తీసుకువచ్చారు, ఎలా వచ్చాయన్న కోణంలో విచారణ చేస్తున్నారు. అందులో భాగంగా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.





Updated : 30 Jun 2023 2:40 PM IST
Tags:    
Next Story
Share it
Top