హైదరాబాద్లో కుండపోత వర్షం.. జనం ఆగమాగం..
X
హైదరాబాద్పై వరణుడి ప్రకోపం కొనసాగుతోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. విరామంలేకుండా వర్షం పడుతుండటంతో జనం బయట అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, బోరబండ, కూకట్ పల్లి, మాదాపూర్, ఫిల్మ్ నగర్ లలో పలు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షాల కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శిథిలావస్థకు చేరిన భవనాలు కూలిపోయే అవకాశముండటంతో అధికారులు వాటిని ఖాళీ చేయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ అస్తవ్యస్థమైంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది.
ఐటి సెక్టార్‌లో కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామైంది. లింగంపల్లి వద్ద రైల్వే అండర్ పాస్ వరద నీటితో నిండిపోయింది. శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, కొండాపుర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, రాయదుర్గం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం వాహనాలను నల్లగండ్ల ఫ్లైఓవర్ మీదుగా దారి మళ్లించారు. సికింద్రాబాద్, కూకట్పల్లి, ఖైరతాబాద్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు చేరింది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరద ప్రాంతంలో పర్యటించారు. వర్షాల నేపత్యంలో నగరవాసులను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ టీంలను అందుబాటులో ఉంచే ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం సైతం భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.