మెట్రో ప్రయాణికులకు షాక్..ఆ మార్గంలో ట్రిప్పుల్లో కోత
X
హైదరాబాద్ మహానగరం అత్యంత రద్దీ ప్రదేశం. నిత్యం లక్షలాది మంది ప్రజలు తమ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు, కాలేజీలకు ప్రయాణిస్తుంటారు. రోజు రోజుకు ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు అధికమయ్యాయి. ఈ క్రమంలో వచ్చిన మెట్రో రైల సర్వీసులు కొంత ప్రజలకు ఊరటను కలిగిస్తున్నాయి. సుదూర ప్రాంతాలకు ప్రజలు, సులువుగా, సురక్షితంగా చేరుకుంటున్నారు. అయినప్పటికీ మెట్రో రైలు కూడా ఇప్పుడు రద్దీ ప్రదేశంగా మారింది. రెడ్ లైన్, బ్లూ లైన్లు రెండూ కూడా నిత్యం ప్రయాణికులతో నిండిపోయి ఉంటుంది. ఈ మార్గంలోని మెట్రోకు మంచి ఆదరణ లభిస్తోంది. కానీ మెట్రోలో గ్రీన్ లైన్లో మాత్రం అంతంత మాత్రంగానే ప్రజలు ప్రయాణిస్తున్నారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు తక్కువగా ఉండటంటో ప్రజలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇప్పటికే ప్రయాణికులు తక్కువగా ఉంటున్నారని 12 నిమిషాలకు ఓ రైలు నడుపుతోంది మెట్రో. ఇప్పుడు ఏకంగా 15 నుంచి 17 నిమిషాలకు ఓ రైలు వస్తుండటంతో మెట్రో రైలు కారిడార్ 2 జేబీఎస్-ఎంజీబీఎస్ ప్రయాణించే ప్రయాణికులు ఉసూరుమంటున్నారు.
జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌కు 10 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. అందుకే మెట్రో ప్రత్యేకంగా గ్రీన్ లైన్ సర్వీసులను నడిపిస్తోంది. ఈ మార్గంలో ఎనిమిది స్టేషన్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించినా రూ.15 మాత్రమే మెట్రో వసూలు చేస్తోంది. ప్రజల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఛార్జీలను సగానికి తగ్గించింది. ఈ మార్గంలో ఇతర ఏ ప్రయాణ సాధనాలతో చూసుకున్నా మెట్రో ఛార్జీలే తక్కువ. ఈ ఆఫర్‌తో గత కొంత కాలంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఇవాళ్టి నంచి స్కూల్స్ ఓపెన్ కావడంతో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో 15 నిమిషాలకు ఓ రైలును నడపడం కాకుండా 8 నిమిషాలకు ఒకటి చొప్పున నడుపుతూ ట్రిప్పుల సంఖ్యను పెంచితే బాగుంటుందని ప్రయాణికులు చెబుతున్నారు.