వర్షాల ఎఫెక్ట్..సైబరాబాద్‌లో మరో రెండు వారాలు ‘లాగౌట్’
X
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి ట్రాఫిక్ జామ్ సమస్య తీవ్రంగా ఉంటుంది. గత కొద్ది రోజులుగా నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రీసెంట్గా సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐటీ కంపెనీల ఉద్యోగులంతా ఒకే షిఫ్ట్‌లో కార్యాలయాలకు వెళ్లకుండా మూడు షిఫ్టుల్లో లాగౌట్ చేయాలని పోలీసులు సూచించారు. వర్షాలు ఇప్పటికీ తగ్గుముఖం పట్టకపోగా, అతి భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో కంపెనీలకు ప్రత్యేక లాగౌట్ టైమ్‌ను మరో 2 వారాలు పొడిగిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తాజాగా ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులను, సహాయక చర్యల గురించిన సమాచారాన్ని కమిషనరేట్‌లోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ లో సీపీ సమీక్షించారు. సీసీ కెమెరాల్లో సిటీలోని చెరువుల తీరును పరిశీలించారు.