ఘనంగా ప్రారంభమైన లాల్‌దర్వాజ బోనాల సంబురాలు.
తొలిబోనం సమర్పించనున్న తలసాని
X
హైదరాబాద్ నగరంలో బోనాలు తుదిఘట్టానికి చేరుకున్నాయి. ఆషాఢమాసం చివరివారం నిర్వహించే బోనాలతో పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయం భక్తులతో సందడిగా మారింది. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్న భక్తులు.. తెల్లవారు జామునుంచే మొక్కులు చెల్లించుకుంటున్నారు. బోనాల సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ బోనాల జాతరలో పాల్గొననున్న నేపథ్యంలో ఆలయం వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలు తొలి బోనం, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఇవాళ బోనాల అనంతరం... రేపు ఘటాలు, ఫలహారం బండ్ల ఊరేగింపుతో ఈ పండుగ ముగియనుంది. ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆలయాన్ని సందర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన పటిష్ఠ ఏర్పాట్లతో.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. బోనాల సందర్భంగా వారం రోజుల నుంచి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి అమ్మవారికి మహా హారతి నిర్వహించారు. నేడు, రేపు లాల్ దర్వాజాలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. పాతబస్తీలో కొలువైన సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చి బోనం సమర్పిస్తున్నారు. అందువల్ల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, బోనాల పండగ సందర్భంగా ఈ రోజు వైన్‌షాపులు బంద్ కానున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి రేపు ఉదయం 6గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి.