జాకీలతో ఇంటిని లేపాలనుకుని.. చివరికి కూల్చేందుకు సిద్ధం..
X
ఆధునిక టెక్నాలజీతో ఇండ్లను ఎత్తు లేపడమనే కాన్సెప్ట్‌ను ఇప్పటికే చాలా చోట్ల చూశాం. ఇంటికంటే రోడ్డు ఎత్తయిందనో, లేదంటే వరదల నుంచి రక్షణ కోసమే పలుచోట్ల హైడ్రాలిక్ జాకీలతో ఇళ్లను రెండు, మూడు అడుగుల వరకూ పైకి లేపుతారు. తాజాగా హైదరాబాద్ చింతల్‌లోని శ్రీనివాస్‌నగర్ కాలనీకి చెందిన నర్సింహారావు అనే వ్యక్తి కూడా తన ఇంటిని జాకీలతో ఎత్తు పెంచడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం బెడిసి కొట్టి.. ఆ భవనం మరో ఇంటిపై ఒరగడంతో అందులో నివాసం ఉంటున్న వారు ప్రాణభయంతో బయటికి పరుగులు పెట్టారు. ఇంటి కింద అమర్చిన హైడ్రాలిక్ జాకీలు ఒక పక్కకు జరగడంతో ఆ ఇల్లు పక్కనున్న భవనంపైకి వాలింది. ఆందోళన చెందిన స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. భవనం పక్కకు వాలిపోయిందని తెలియగానే ఆ రెండు ఇళ్లలో నివాసం ఉండే వారంతా బయటకు వచ్చేశారు.
స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహారావు.. 25 సంవత్సరాల క్రితం జీ ప్లస్ 2 విధానంలో ఇంటిని నిర్మించారు. ప్రస్తుతం అక్కడ రోడ్డు ఎత్తు పెరగడంతో.. వర్షం కురిసిన ప్రతిసారి వారి ఇంట్లోకి వరద నీరు ప్రవేశిస్తోంది. తెలిసిన వారి సూచనల మేరకు ఇంటి ఎత్తును పెంచాలని అనుకున్నాడు. దీనికి సంబంధించి చర్యలు చేపట్టాడు. ఈ పనులను ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించాడు. ఆ బిల్డింగ్‌లో నర్సింహారావు ఫ్యామిలీతో సహా ఆరు కుటుంబాలు ఉంటున్నాయి.
జాకీలతో బిల్డింగ్ హైట్ పెంచే పనులు ప్రారంభమైన తర్వాత రెండు కుటుంబాలు ఖాళీ చేయగా.. మరో రెండు కుటుంబాల వారు సమీపంలోని తెలిసిన వారి ఇళ్లకు ఛేంజ్ అయ్యారు. ఓనర్ ఫ్యామిలీతోపాటు మరో ఫ్యామిలీ అందులోనే ఉంటున్నారు. ఇంటిని ఎత్తు పెంచేందుకు వినియోగించిన హైడ్రాలిక్ జాకీలు అదుపు తప్పడంతో ఒక్కసారిగా ఆ భవనం పక్కనున్న మరో భవనంపైకి ఒరిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అనంతరం భద్రతా చర్యలు చేపట్టారు. అనుమతులు లేకుండా మరమ్మతులు చేపట్టిన ఇంటి ఓనర్ నర్సింహారావుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పక్కకు ఒరిగిపోయిన భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించామని.. కూల్చివేత పనులను నేడు చేపట్టనున్నామని అధికారులు తెలిపారు.