పంద్రాగస్ట్ వేడుకల వేళ.. గోల్కొండలో ఆంక్షలు.. చూసుకోకపోతే అంతే..!
X
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా గోల్కొండ కోటలో వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆగస్టు 15న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. రాందేవ్ గూడ నుంచి గోల్కొండ కోటకు వచ్చే రోడ్డు పుర్తిగా మూసేయనున్నారు. స్వాతంత్ర్య వేడుకలకు హాజరయ్యే వాళ్లకు అధికారులు ఇప్పటికే పాసులు జారీ చేయగా.. ఆ మార్గంలో A గోల్డ్, A పింక్, B బ్లూ పాసులు ఉన్న వాహనాలను మాత్రమే ఆంక్షలు విధించిన దారిలో అనుమతిస్తారు.
వేడుకల కోసం సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్లు.. బంజారాహిల్స్- మెహదీపట్నం- రేతిబౌలి- నాలానగర్- లంగర్ హౌస్ బ్రిడ్జ్- రాందేవ్ గూడ మీదుగా చేరుకోవాలి. A గోల్డ్ పాస్ ఉన్న వాళ్లు కోట ప్రధాన ద్వారం ఎదురుగా, A పింక్ పాస్ ఉన్నవాళ్లు గోల్కొండ బస్ స్టాప్ లో, B బ్లూ పాస్ ఉన్నవాళ్లు ఫుట్ బాల్ గ్రౌండ్ లో పార్కింగ్ చేసుకోవాలని పోలీస్ అధికారులు సూచించారు. C గ్రీన్ పాస్ ఉన్నవాళ్లు సెవెన్ టూంబ్స్, బంజారా దర్వాజా మీదుగా వచ్చి ఓవైసీ జీహెచ్ఎంసీ గ్రౌండ్ లో, D రెడ్ పాస్ ఉన్నవాళ్లు షేక్ పేట్ - టోలీచౌక్- బంజారా దర్వాజా మీదుగా వచ్చి హుడా పార్క్ లో పార్కింగ్ చేసుకోవాలి. E బ్లాక్ సాధారణ పాస్ కలిగినవాళ్లు కూడా హుడా పార్క్ లో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.