అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. తుపాకీతో రెచ్చిపోయిన టీనేజర్!
X
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఐయోవా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో ఓ టీనేజర్ తుపాకీతో కాల్పులకు దిగడంతో 11 ఏళ్ల స్టూడెంట్ మృతి చెందాడు. గాయపడ్డవారిలో స్కూల్ అడ్మినిస్ట్రేటర్ తో పాటు నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే, గాయపడ్డ వారెవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు పేర్కొన్నారు. పెర్రీ నగరంలోని ఓ పాఠశాలలో నిన్న (గురువారం) ఉదయం ఈ సంఘటన జరిగింది. ఈ దాడులకు పాల్పడింది, 17 ఏళ్ల టీనేజర్ అని పోలీసులు చెప్పుకొచ్చారు. ఘటనా స్థలంలో పోలీసులకు ఓ ఐఈడీ బాంబు కూడా దొరికినట్లు తెలిపారు.
కాల్పుల సమయంలో స్కూల్‌లోనే ఉన్న ఓ విద్యార్థిని ఎవా ఆ భయానక సంఘటన గురించి స్థానిక మీడియాతో చెప్పింది. కాల్పుల శబ్దం వినగానే తాను తరగతి గదిలోకి వెళ్లి దాక్కున్నట్టు పేర్కొంది. తరువాత బయటకు వచ్చి చూస్తే అక్కడంతా పగిలిన గాజు ముక్కలు, రక్తం మరకలు కనిపించాయని చెప్పింది. శీతాకాలం సెలవుల తర్వాత స్కూల్ స్టార్ట్ అయిన తొలి రోజునే ఈ కాల్పులు జరగడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.