Home > అంతర్జాతీయం > ఉరుగ్వే తీరంలో విషాదం.. 10 రోజుల్లో 2వేల పెంగ్విన్లు మృతి..

ఉరుగ్వే తీరంలో విషాదం.. 10 రోజుల్లో 2వేల పెంగ్విన్లు మృతి..

ఉరుగ్వే తీరంలో విషాదం.. 10 రోజుల్లో 2వేల పెంగ్విన్లు మృతి..
X

తూర్పు ఉరుగ్వే తీరంలో హృదయ విదారక దృశ్యం చోటు చేసుకుంది. తీరప్రాంతంలో ఎటు చూసిన గుట్టలుగా పెంగ్విన్ల కళేబరాలే కనిపిస్తున్నాయి. గత 10 రోజులుగా దాదాపు 2వేల పెంగ్విన్ల కళేబరాలు కొట్టుకొచ్చాయి. చనిపోయిన వారిలో పెంగ్విన్ పిల్లలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఇవి చనిపోయి ఉంటాయని అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి పెంగ్విన్ల కళేబరాలు సముద్ర నీటి ప్రవాహంలో కొట్టుకువచ్చి ఉరుగ్వే తీరానికి చేరుకుని ఉంటాయని భావిస్తున్నారు. ఈ పెంగ్విన్లు ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా కారణంగా చనిపోలేదని ఉరుగ్వే పర్యావరణ శాఖ మంత్రి కార్మెన్ లీజాగోయెన్ స్పష్టం చేశారు. అధికారులు వేల సంఖ్యలో పెంగ్విన్ల మరణానికి కారణం తెలుసుకునే పనిలో పడ్డారు.

మెగెల్లానిక్ పెంగ్విన్‌లు సాధారణంగా దక్షిణ అర్జెంటీనాలో నివసిస్తుంటాయి. చలికాలంలో ఆహారం, వెచ్చని నీటి కోసం ఉత్తరానికి వలసవెళ్తుంటాయి. ఈ క్రమంలో బ్రెజిల్‌లోని ఎస్పిరిటో శాంటో తీరానికి కూడా వస్తుంటాయి. ఇలా వస్తున్న సమయంలో కొన్ని పెంగ్విన్లు చనిపోవడం సాధారణమేనని కార్మెన్ లీజాగోయెన్ చెప్పారు.. అయితే ఇంత భారీ సంఖ్యలో పెంగ్విన్లు ఎందుకు మరణించాయన్నది అంతుచిక్కడం లేదన్నారు.

అక్రమ చేపల వేట పెంగ్విన్ల మరణానికి కారణమై ఉండొచ్చని పర్యావరణవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జూలై మధ్యలో ఆగ్నేయ బ్రెజిల్‌ను తాకిన తుఫాన్‌ కూడా కారణమై ఉండొచ్చని అంటున్నారు. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోలేక పెంగ్విన్‌ పిల్లలు చనిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు.


Updated : 22 July 2023 11:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top