Emergency Landing: డైపర్‌ను చూసి బాంబు అనుకొని.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
X
ఓ ప్రయాణికుడి మాటలు నమ్మి.. ఆకాశంలో దూసుకుపోతున్న విమానాన్ని అత్యవసరంగా కిందికి దింపారు ఆ విమాన సిబ్బంది. ఆ తర్వాత మొత్తం విమానంలో ఉన్న ప్రయాణికులందరిని కిందికి దింపారు. వెంటనే విమానంలో సెక్యూరిటీ సిబ్బంది చేత తనిఖీలు చేయించారు. అమెరికాలోని పనామా సిటీలో ఈ గందరగోళం చోటుచేసుకుంది.
కోపా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం పనామా సిటీ నుంచి ఫ్లోరిడాకు బయలుదేరింది. ఓ గంట ప్రయాణించాక టాయిలెట్ లోకి వెళ్లిన ఓ ప్రయాణికుడికి అనుమానాస్పద వస్తువు కనిపించింది. ఈ విషయాన్ని వెంటనే విమానంలోని సిబ్బందికి తెలిపాడు. దానిని పరిశీలించి బాంబు కావచ్చని భయాందోళనకు గురయ్యారు. విషయాన్ని పైలట్ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులకు సమాచారం అందించి, విమానాన్ని వెనక్కి తిప్పారు. మళ్లీ పనామాలోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఫ్లైట్ లోని 144 మంది ప్రయాణికులను కిందికి దించి విమానంలో బాంబ్ స్క్వాడ్ గాలింపు చేపట్టింది.
తనిఖీల్లో.. టాయిలెట్ లోని ఆ అనుమానాస్పద వస్తువును అనారోగ్య సమస్యల కారణంగా పెద్దవాళ్లు వేసుకునే ఆ డైపర్ గా గుర్తించింది. అయినప్పటికీ విమానాన్ని అణువణువూ గాలించింది. పేలుడు పదార్థాలు ఏవీ కనిపించకపోవడంతో తిరిగి ప్రయాణానికి అనుమతిచ్చింది. దీంతో విమానం ఆలస్యంగా ఫ్లోరిడాకు బయలుదేరింది.