Home > అంతర్జాతీయం > రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా ఫ్లైట్

రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా ఫ్లైట్

రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా ఫ్లైట్
X

రష్యాలో అష్టకష్టాలుపడ్డ ఎయిరిండియా ప్యాసింజర్లకు రిలీఫ్ దొరికింది. ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లెం కారణంగా రష్యాలో ఉండిపోవాల్సి వచ్చిన ప్రయాణికులు ఎట్టకేలకు అమెరికాకు ప్రయాణమయ్యారు. దాదాపు 40 గంటల నిరీక్షణ తర్వాత ముంబై నుంచి వెళ్లిన స్పెషల్ ఫ్లైట్ గురురువారం ఉదయం రష్యాలోని మగడావ్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అక్కడి నుంచి ప్రయాణికులను తీసుకుని శాన్‌ఫ్రాన్సిస్కోకు టేకాఫ్‌ అయినట్లు ఎయిరిండియా ప్రకటించింది.

ఇంజిన్లో సమస్య

జూన్ 6న ఉదయం 4.05 గంటలకు ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయిరిండియా AI173 ఫ్లైట్ లోని ఓ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని రష్యాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అలా మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు ఈ విమానాన్ని మగడాన్‌ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా దించారు. దీంతో ఫ్లైట్లోని 216 మంది ప్యాసింజర్లతో పాటు 16 మంది సిబ్బంది అక్కడే చిక్కుకుపోయారు.

ప్యాసింజర్ల అవస్థలు

మగడాన్‌ ప్రాంతం రష్యా రాజధాని మాస్కోకు 10వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. మగడాన్-మాస్కో మధ్య విమాన ప్రయాణానికి దాదాపు ఏడున్నర గంటల సమయం పడుతుంది. ఈ ప్రాంతంలో హోటళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులను డార్మిటరీల్లోనే బస ఏర్పాటు చేశారు. దీంతో ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరైన వసతులు లేని కారణంగా ప్రయాణికులను బస్సుల్లో పలు ప్రాంతాలకు తరలించారు. అయితే లగేజీలు విమానంలో ఉండటంతో కనీసం మార్చుకునేందుకు బట్టల్లేక వారంతా ఇబ్బందులు పడ్డారు. హెల్త్ ప్రాబ్లెం ఉన్నవారు మందులు అందుబాటులో లేక సమస్యలను ఎదుర్కొన్నారు.

అనుమతులు రాక ఆలస్యం

మరోవైపు ప్రయాణికుల్ని వీలైనంత త్వరగా అక్కడి నుంచి తరలించేందుకు ఎయిరిండియా ప్రయత్నించినా కొన్ని పర్మిషన్లకు సమయం పట్టడంతో ఆలస్యమైంది. చివరకు బుధవారం మధ్యాహ్నం 3.20 గంటలకు ముంబై నుంచి మగడాన్‌కు బయలుదేరిన ఎయిరిండియా ప్రత్యేక విమానం అర్ధరాత్రి దాటిన తర్వాత రష్యా చేరుకుంది. గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రయాణికులను తీసుకుని ఈ విమానం శాన్‌ఫ్రాన్సిస్కో బయల్దేరింది. ఈ విమానంలో 50మందికన్నా తక్కువ మంది యూఎస్ పౌరులు ఉన్నట్లు యూఎస్ ప్రకటించింది.

Updated : 8 Jun 2023 12:21 PM IST
Tags:    
Next Story
Share it
Top