Jaime Maussan : ఏలియన్ల శవాలని చెప్పినోడు చేసిన నిర్వాకం ఇదీ..
X
ఈ సువిశాల విశ్వంలో మన భూగ్రహం మీద తప్ప మరే గ్రహాలపైనా జీవం ఆనవాళ్లు ఉన్నట్టు ఇంతవరకూ ఆధారాలు లభించలేదు. విశ్వంలో మనకు తెలిసింది గోరంత భాగం గురించే కాబట్టి మనకు తెలియని గ్రహగోళాల్లో జీవం ఉండొచ్చని భావిస్తుంటారు. అంగారకుడిపై చేపట్టిన పరిశోధనల్లో అక్కడ ఒకప్పుడు నీరు ఉండిందని చెప్పే ఆనవాళ్లు ఉండడంతో ప్రాణులు కూడా బతికి ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా. మొత్తానికి ఇదంతా వేరే గ్రహాల వ్యవహారం.
కానీ మన భూమ్మీదే గ్రహాంతర వాసులు తిరిగారని చెబుతున్న జైమే మెస్సాన్ అనే జర్నలిస్టు ఇటీవల తెరముందుకు తీసుకొచ్చిన ‘ఏలియన్’ శవాలు మళ్లీ చర్చకు దారి తీశాయి. గుర్తుతెలియని ఎగిరే పళ్లేల గురించి కూడా ఆరా తీసే మెస్సాన్ మెక్సికో పార్లమెంటులో ప్రదర్శించిన రెండు ‘ఏలియన్ మృతదేహాలు’పై శాస్త్రవేత్తలు ఆరా తీస్తున్నారు. వీటి డీఎన్ఏలో మూడింట ఒక వంతు మనిషులది కాదని, అవి వెయ్యేళ్ల నాటివని మాసాన్ అంటున్నాడు. దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ దేశంలోని కుస్కోలో 2017లో ఇవి దొరికాయంటున్నాడు.
అయితే మాసాన్ ఇలా చెప్పడం కొత్తేమీ కాదని కొందరు శాస్త్రవేత్తలు తోసిపుచ్చుతున్నారు. ఆ ‘శవాల’ గురించి నిజానిజాలు నిగ్గుదేల్చడానికి అందరికీ అందుబాటులో ఉంచి పరీక్షలు జరపాల్సి ఉందని, అది చేయకుండా ఏదోదో చెప్పడం సరికాదని అంటున్నారు. మాసాన్ ఇదివరకు కూడా ఇలాగే చెప్పి బోల్తాకొట్టించిన వైనాన్ని గుర్తుచేస్తున్నారు.
మైసాన్ 2015లోనూ ఓ శవాన్ని పట్టుకొచ్చి ‘ఏలియన్’ అన్నాడు. అది కూడా పెరూలోని నాజ్కాలో దొరికిందని, దాని ఆకారం, ధాతువులు మనుషులు కావని బుకాయించాడు. పరిశోధకులు దాన్ని పరీక్షించగా ఎప్పుడో చనిపోయిన మనిషిదే అని, ఓ చిన్నారిది అని తేలింది. మాసాన్ ఇప్పుడు పట్టుకొచ్చినవి కూడా అలాంటివే కావొచ్చని, అవి పిల్లల శవాలో లేకపోతే సిమెంటు గచ్చు బొమ్మలో కావొచ్చని అంటున్నారు. వాటిపై నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వంటి విశ్వసనీయ సంస్థలు పరిశోధనలు చేస్తనే నిజానిజాలు బయటపడతాయంటున్నారు.