ఆరోపణలు నిజమని తేలితే...కెనడా రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X
భారత్- కెనడా దేశాల మధ్య ఖలిస్తాన్ వివాదం రగులుతూనే ఉంది. సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్య విషయంలో భారత్ హస్తముందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలైన విషయం తెలిసిందే. దీంతో భారత్ కెనడా సంబంధాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా కెనడా రక్షణ శాఖ మంత్రి బిల్ బ్లెయిర్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. భారత్‌తో రక్షణ సంబంధాలు తమకెంతో ముఖ్యమని.. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వం కూడా తమకు ముఖ్యమేనని అన్నారు. ‘ది వెస్ట్ బ్లాక్’ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నిజ్జర్ హత్య రెండు దేశాల మధ్య సంబంధాలకు సవాల్ గా మారిందన్నారు బిల్ బ్లెయిర్. తమ దేశ భూభాగాన్ని, చట్టాలను, పౌరులను రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్న మంత్రి బిల్ బ్లెయిర్.. నిజ్జర్ హత్య తమకు సమస్యాత్మకంగా మారిందన్నారు. ఇక ఈ కేసులో ఉన్న ఆరోపణలు నిజమని తేలితే ఇది ఒక ఆందోళనకరమైన అంశంగా మారుతుందన్నారు. కాగా, నిజ్జర్ హత్యకు సంబంధించి భారత ఏజెంట్ల పాత్రపై కీలక సమాచారాన్ని అమెరికా నిఘా వర్గాలే కెనడాకు అందజేసినట్టు కథనాలు వెలువడుతున్నాయి.
ఇదే సమయంలో కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాద కార్యకలాపాలపై చర్యలు తీసుకోకపోవడానికి తమ పార్టీదే బాధ్యత అని కెనడా అధికార లిబరల్ పార్టీ ఎంపీ చంద్ర ఆర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల బెదిరింపులతో కెనడా హిందువుల్లో భయం నెలకొందని భారత సంతతి సభ్యుడు చంద్ర ఆర్య స్పష్టం చేశారు. జస్టిన్ ట్రూడో పార్టీకి చెందిన ఆర్య.. తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో హిందూ కెనడియన్లు సంయమనంతో ఉండాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.