సముద్రంలోకి వాటిని వదులుతున్న జపాన్.. ఆసియా దేశాల్లో టెన్షన్..
X
అణ్వాయుధాలు ఎంత ప్రమాదకరమో అన్ని దేశాలకన్నా జపాన్‌కు మరింత బాగా తెలుసు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా నాగసాకి, హిరోషిమాలపై వేసిన అణుబాంబుల దాడి దుష్ఫలితాల నుంచి ఆ దేశం ఇంకా కోలుకోనే లేదు. అణు పదార్థాల పీడ అనుభవించిన జపాన్ గత్యంతరం లేని పరిస్థితిలో న్యూక్లియర్ వాటర్ ఆపరేషన్ మొదలు పెట్టింది. అన్ని పరిస్థితులు బావుంటే బుధవారం నుంచి ‘అణు జలాలను’ పసిఫిక్ మహాసముద్రంలోకి వదిలేయనుంది. ఆ నీటివల్ల తమకు ముప్పు ఏర్పడుతుందని చుట్టుపక్కల ఆసియా దేశాలు వణికిపోతున్నాయి. అయితే అణు జలాలను చాలావరకు శుద్ధి చేసి వదిలేశామని జపాన్ భరోసా ఇస్తోంది. ఎంత శుద్ధేసినా న్యూక్లియర్ అవశేషాలు పోయేవి కావని, తమ తీర జలాలు కలుషితమై జీవజాలానికి ముప్పు ఏర్పడుతుందని దక్షిణ కొరియా, చైనా తదితర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఏమిటీ జలాలు?
2011లో జపాన్ తీరంలో సంభవించిన భారీ భూకంపంలో ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం దెబ్బతినింది. దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించే ఆపరేషన్‌లో అణు జలాల విడుదల కీలలకమైనది. అణు రియాక్టర్‌లోని పన్నెండేళ్ల నుంచి నిల్వ ఉన్న నీటిని నిర్వహించడం జపాన్‌కు ఆర్థికంగా భారం అవుతోంది. ప్లాంటును తొలగించాలంటే ఆ నీటిని సముద్రంలోకి వదలడం మినహా మరో మార్గం లేదు. నీటిని శుద్ధి చేసే వదలుతామని చెప్పడంతో ఐక్యరాజ్య సమితికి చెందిన ఐఏఈఏ అంగీకరించింది. రియాక్టర్‌లో 1.34 మిలియన్ టన్నుల అణు జలాలు ఉన్నాయి. వీటితో 500 ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్స్ నింపొచ్చు. టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ ఈ వ్యర్థజలాన్ని శుద్ధి చేసి 60 రకాల అణుధార్మిక పదార్థాలను తొలగించిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే అందులో ప్రమాదకరమైన ట్రీటియం, కార్బన్-14 ఇంకా ఉన్నాయని పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు. అయిత పసిఫిక్ మహాసముద్రంతో పోలిస్తే ఆ నీటి మోతాదు చాలా తక్కువని, సముద్రంలో కలిశాక సమస్యలు ఉండవని ఇంపీరియల్ కాజేల్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ గెర్రీ థామస్ అంటున్నారు. ఆనీటిని వదిలితే చుట్టుపక్కల తీర దేశాల్లో చేపలు చచ్చిపోతాయని దక్షిణ కొరియా, చైనాలు మండిపడుతున్నాయి. నీటిని నిల్వ చేసే ఉంచాలని జపాన్‌లోనూ డిమాండ్ వస్తోంది.