Home > అంతర్జాతీయం > అమెరికాలో కాల్పుల మోత.. 22 మంది మృతి

అమెరికాలో కాల్పుల మోత.. 22 మంది మృతి

అమెరికాలో కాల్పుల మోత.. 22 మంది మృతి
X

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మైనే రాష్ట్రంలోని లూయిస్టన్ నగరం తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. రెండు ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోగా... మరో 60 మందికిపైగా గాయపడ్డారు. స్థానిక బార్ బౌలింగ్ అల్లే, వాల్‌మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో బుధవారం తెల్లవారుజామున కాల్పులు చోటుచేసుకున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించామని, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఘటనా స్థలిలో సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నామని వారు చెప్పారు.





ఇంటర్నేషనల్ మీడియా ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున లూయిస్టన్ నగరంలో కనీసం రెండు చోట్ల కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారని, సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో కనిపించిన అనుమానితుడి రెండు ఫోటోలను విడుదల చేశారని పేర్కొంది. ఆండ్రోస్కోగిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఫేస్‌బుక్‌లో స్పందిస్తూ.. తాము దర్యాప్తు చేపట్టామని, అనుమానితుడు ఇంకా పరారీలో ఉన్నాడని తెలిపింది. నివాసితులు తమ ఇళ్ల తలుపులు వేసి లోపల ఉండాలని , వీధుల్లోకి రావొద్దని పేర్కొంది. కాగా.. గతేడాది మే తర్వాత అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన సామూహిక కాల్పుల ఘటన ఇదే కావడం గమనార్హం. మే 2022లో టెక్సాస్‌ రాష్ట్రం ఉవాల్డేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ముష్కరుడు కాల్పులు జరిపి, 19 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులను పొట్టనబెట్టుకున్న విషయ తెలిసిందే.







Updated : 26 Oct 2023 3:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top