Pakistan Election 2024 : పోలింగ్ స్టేషన్ వద్ద కాల్పులు.. బ్యాలెట్ బాక్సులు మాయం.. పాకిస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గందరగోళం
X
పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి గురువారం (ఫిబ్రవరి 8) పోలింగ్ జరుగుతుంది. నాలుగు ప్రావిన్షియల్ అసెంబ్లీలలోని 336 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతుంది. రాజకీయ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఎన్నికలు జరుగుతుండగా.. ఈ క్రమంలో పలుచోట్లు కొంత గందరగోళం నెలకొంది. పాకిస్తాన్, ట్యాంక్ ఏరియాలోని ఒక పోలింగ్ బూత్ వద్ద దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు మృతి చెందినట్లు ఏఆర్‌వై న్యూస్ చానెల్ ప్రకటించింది. కాగా ఎన్నికలకు రెండు రోజుల ముందు రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో దేశం మొత్తం మొబైల్ సేవలు నిలిపేశారు. ఉగ్రదాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఇదిలా ఉండగా.. మరికొన్నిచోట్ల ఓటింగ్ మొదలయ్యేముందు బ్యాటెట్ పేపర్లు ఉన్న బాక్సులను కొందరు దుండగులు మాయం చేశారు. బ్యాలెట్ పేపర్ల కోసం అధికారులు బ్యాగులు తెరవగా.. వాటిలో భారీ సంఖ్యలో బ్యాలెట్ పేపర్లు మాయమయ్యాయి. దీంతో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగా మూడు ప్రావిన్సుల అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మూడు ప్రాంతాల్లో పోటీకి దిగిన అభ్యర్థులు మృతి చెందారు. దీంతో ఇక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వీటిలో ఎన్‌ఏ-8 (బజౌర్), పీకే-22 (బజౌర్), పీకే-91 (కోహట్), పీపీ-266 (రహీమ్ యార్ ఖాన్) ప్రాంతాలు ఉన్నాయి.