అకౌంట్‌లో పైసా లేకపోయినా ఏటీఎం నుంచి 80 వేలు డ్రా చేసుకోవచ్చు.. ఎగబడుతున్న జనం
X
‘’రండి బాబూ రండి! మీ అకౌంట్‌లో డబ్బు లేకపోయినా ఏటీఎంలో డ్రా చేసుకోండి. మొహమాట పడొద్దు. మేం ఉన్నది మీకోసమే’’ అంటోంది ఓ బ్యాంకు. భలే మంచి చౌకబేరమూ అంటూ దేశంలోని ఆ బ్యాంకు కస్టమర్లందరూ ఏటీఎంలకు పోటెత్తుతున్నారు. తమ బ్యాంకులో ఖాతా ఉన్నవారందరూ ఖాతాల్లో పైసా డబ్బు లేకపోయినా వెయ్యి డాలర్లను డ్రా చేసుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఊరికే కాదులెండి, డ్రా చేసుకున్న సొమ్మును తర్వాత వసూలు చేస్తుందట. ఊరికే ఇవ్వడం, మళ్లీ తీసుకోవడం ఏమిటి? అప్పు కాదు కదా అనే అనుమానం అక్కర్లేదని, పైసా వడ్డీ లేకుండానే ఇస్తున్నామని చెబుతోంది. బ్యాంక్ కంప్యూటర్లు, మొబైల్ యాప్‌ల సాఫ్ట్‌వేర్ క్రాష్ కావడమే దీనికి కారణం.
సాంకేతిక కారణాల వల్ల ఆన్‌లైన్ లావాదేవీలన్నీ ఆగిపోవడంతో బ్యాంకు తన కస్టమర్ల కోసం ఈ సదుపాయం కల్పించింది. వెయ్యి డాలర్లు (రూ. 83 వేలు) వరకు ఏటీఎంల నుంచి డ్రా చేసుకోవచ్చని చెప్పడంతో జనం ఏటీఎంల ముందు క్యూ కట్టారు. ఏటీఎంల వద్ద రద్దీ పెరిగి గొడవలవుతుండడంతో పోలీసులు రంగంలోకి దిగి జనాన్ని చెదరగొడుతున్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, తర్వాలోనే సాఫ్ట్‌వేర్ సమస్యలు తొలగిపోతాయని బ్యాంకు చెబుతోంది.