హవాయిలో కార్చిచ్చు బీభత్సం.. భారత్ నుంచి తీసుకెళ్లిన ఆ మర్రి చెట్టు మాత్రం..
X
అమెరికాలోని హవాయి దీవిలో కార్చిచ్చు కొనసాగుతోంది. ఇప్పటికే అది పెను నష్టాన్ని మిగిల్చింది. కార్చిచ్చు సృష్టించిన బీభత్సానికి లహైనా రిసార్టు సిటీ అల్లాడుతోంది. మంటల కారణంగా మృత్యువాత పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ ప్రకటించారు. మంటల ధాటికి 1000కిపైగా ఇండ్లు ధ్వంసమయ్యాయి. వందల సంఖ్యలో కార్లు, ఇతర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. హరికేన్ ప్రభావంతో వీస్తున్న బలమైన గాలులు కార్చిచ్చు మరింత విజృంభించేందుకు కారణమవుతోంది. దట్టమైన పొగ అలుముకోవడంతో జనం శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. పొగ, మంటల బారి నుంచి తప్పించుకునేందుకు పసిఫిక్ మహా సముద్రంలోకి దూకారు.
కార్చిచ్చు చెలరేగిన ప్రాంతానికి చెందిన ప్రజలను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు 53 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఒకవైపు కార్చిచ్చు ఆర్పేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తుంచే.. మరోవైపు కొన్ని చోట్ల మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి.
కార్చిచ్చు కారణంగా మహా వృక్షాలు సైతం కాలి బూడిదయ్యాయి. అయితే లహైనా కోర్ట్‌హౌజ్ ముందు నాటిన మర్రి చెట్టు మాత్రం స్వల్పంగా కాలిపోయింది. 1873లో ఇండియా నుంచి ఈ మర్రి మొక్కను తీసుకువెళ్లి అక్కడ నాటారు. 150 ఏళ్లుగా ఆ చెట్టు తన ఊడలను విస్తరిస్తూ పోయింది. లహైనా హార్బర్ సమీపంలో ఆ వృక్షం టూరిస్టులను ఆకర్షించేది. అయితే ఆగస్టు 10న రాజుకున్న కార్చిచ్చు కారణంగా ఇప్పుడు ఆ మర్రిచెట్టు ఆనవాళ్లు కోల్పోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Banyan Tree in Lahaina smoldering at the base, but still standing. Just about the only thing left, other than the Lighthouse. pic.twitter.com/t0lGeOwY2H
— Brian Schatz (@brianschatz) August 10, 2023