కాఫీ ధరపై లొల్లి పెట్టుకున్న ప్రపంచ కుబేరుడి భార్య
X
కోటీశ్వరులు, లక్షాధికారులైన వాళ్లు.. బయట తాగే కాఫీ, టీ ల దగ్గర.. తినే టిఫిన్, స్నాక్స్ దగ్గర ఖర్చు పెట్టేటప్పుడు పెద్దగా ఆలోచించరు అని అనుకుంటే పొరపాటే. ఆ వస్తువుకి లేదంటే ఆ పదార్ధానికి అంత విలువ ఉందా?లేదా అని ఆలోచిస్తారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ (Warren Buffett) గారి సతీమణి ఆస్ట్రిడ్ బఫెట్ (Astrid Buffett)కూడా అలాగే అనుకొని.. ఒక్క కాఫీకి నాలుగు డాలర్లు(రూ. 328) ఎక్కువ అని అభిప్రాయపడ్డారు. అంతే కాదు అంత రేటు చాలా ఎక్కువని ఫిర్యాదు కూడా చేశారు. దీనికి సంబంధించిన విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రముఖ అంతర్జాతీయ మీడియా.. న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వార్త ప్రకారం.. అమెరికాలోని సన్ వ్యాలీ రిసార్ట్‌లో అలెన్ అండ్ కో సంస్థ వార్షికోత్సవంలో భాగంగా బిలియనీర్ల కోసం సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్‌నకు హాజరైన ఆస్ట్రిడ్ బఫెట్.. రిసార్ట్ సిబ్బంది ఒక కాఫీకి నాలుగు డాలర్లు వసూలు చేయడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. ‘‘మిగతా చోట్ల ఆ ధరకు ఒక పౌండ్ కాఫీ (32 టేబుల్ స్పూన్‌ల కాఫీ పొడి) కొనుగోలు చేయొచ్చు’’ అని రిసార్ట్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారట. అంతేకాకుండా.. సరసమైన ధరలకు కాఫీ విక్రయించాలని వారికి సూచించినట్లు వార్తా కథనం పేర్కొంది.
అయితే, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ భార్య నాలుగు డాలర్ల కాఫీ కోసం ఫిర్యాదు చేశారనే వార్తలపై నెట్టింట చర్చ మొదలైంది. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాగా, సంపద ఎంతున్నా వారెన్ బఫెట్ మహా పొదుపరి. 1958లో 31,500 డాలర్లకు కొనుగోలు చేసిన ఇంట్లోనే ఆయన ఇప్పటికీ నివసిస్తున్నారు. . ప్రస్తుతం ఆయన సంపద విలువ 114 బిలియన్ డాలర్లు.