Home > అంతర్జాతీయం > చిన్నారిపై జాతివివక్ష.. పోటీలో గెలిచినా మెడల్ ఇవ్వలేదు.. (వీడియో)

చిన్నారిపై జాతివివక్ష.. పోటీలో గెలిచినా మెడల్ ఇవ్వలేదు.. (వీడియో)

చిన్నారిపై జాతివివక్ష.. పోటీలో గెలిచినా మెడల్ ఇవ్వలేదు.. (వీడియో)
X

ఐర్లాండ్ జిమ్నాస్టిక్స్ పోటీల్లో గతేడాది చోటు చేసుకున్న ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. క్రీడాస్ఫూర్తి చాటాల్సిన వేదికపై ఓ మహిళా ప్రతినిధి చిన్నారి పట్ల వివక్ష చూపింది. పోటీల్లో గెలిచిన బాలికకు తన రంగు కారణంగా మెడల్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. తోటి చిన్నారులు మెడలో మెడల్స్ చూసుకొని మురిసిపోతుంటే ఆ అమ్మాయి మాత్రం బేలగా చూస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఐర్లాండ్‌ డబ్లిన్‌లో గతేడాది మార్చిలో జిమ్నాస్టిక్‌ పోటీలు జరిగాయి. టోర్నీలో భాగంగా చిన్నారుల విభాగంలో గెలిచిన వారికి మెడల్స్ అందజేశారు. అయితే ఆ సమయంలో ఓ మహిళా ప్రతినిధి ఓ చిన్నారి పట్ల దారుణంగా వ్యవహరించారు. నల్లజాతి బాలికకు పతకం ఇవ్వకుండా జాతి వివక్షకు పాల్పడ్డారు. సదరు అమ్మాయికి తప్ప మిగిలిన వారందరికీ మెడల్స్ ఇచ్చిన ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. తనకు మెడల్ ఎందుకు ఇవ్వలేదో అర్థంకాక సదరు బాలిక అయోమయంలో పడింది. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు మహమ్మద్ సఫా అనే మానవ హక్కుల కార్యకర్త సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారాయి. దీంతో ఈ జాతివివక్ష విషయం వెలుగులోకి వచ్చింది.

అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో ఐర్లాండ్‌ జిమ్నాస్టిక్‌ ఫెడరేషన్‌ స్పందించింది. ఆ బాలికకు బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ‘ఘటన కారణంగా ఆ బాలిక, ఆమె కుటుంబం పడిన ఇబ్బందికి క్షమాపణలు కోరింది. జరిగినదానికి పశ్చాత్తాపడుతున్నామని చెప్పింది. వివక్ష ఏ రూపంలోనైనా సరే మేం దాన్ని సహించబోమని ప్రకటన విడుదల చేసింది. బాలిక, ఆమె కుటుంబానికి లిఖితపూర్వకంగా క్షమాపణలు కూడా చెప్పినట్లు వెల్లడించింది.

ఇదిలా ఉంటే వీడియో షేర్ చేసిన మహమ్మద్ సఫా ఐర్లాండ్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ప్రకటనపై స్పందించారు. అది ఫేక్ న్యూస్ అని కొట్టిపడేశారు. జాతివివక్ష గురించి మాట్లాడినందుకు కొందరు వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేశారని, అందుకే వీడియోను మళ్లీ షేర్ చేస్తున్నట్లు చెప్పారు. బాలిక కుటుంబానికి ఎవరూ క్షమాపణలు చెప్పలేదని ఆమె తల్లి స్వయంగా చెప్పిందని ట్వీట్లో రాశారు. ఆ బాలికను ఫేమస్ చేయాలని కోరారు.


Updated : 26 Sept 2023 3:23 PM IST
Tags:    
Next Story
Share it
Top