స్పెయిన్ కెనరీ దీవుల్లో మంటలు
X
స్పెయిన్ దేశంలోని కెనరీ దీవుల్లో అడవులు తగలబడిపోతున్నాయి. శరవేగంగా మంటలు అంతటా వ్యాపిస్తున్నాయి. దీంతో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.స్పెయిన్ లోని కెనరీ దీవుల్లో 11 వేల ఎకరాల్లో కార్చిచ్చు వ్యాపించింది. అది అంతకంతకూ ఎక్కువ అవుతోంది. మంటలు మరింత వ్యాపిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. మంటలను ఆర్పేందుకు 10 హెలికాప్టర్లు సహాయంతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ ఎంత చేసినా శ్రమకు తగ్గ ఫలితం కనడబం లేదని చెబుతున్నారు అధికారులు. కెనరీ దీవుల్లోని లా పాల్మా కొండమీద ఈ కార్చిచ్చు మొదలైందని సమాచారం. అక్కడ ఓ అగ్ని పర్వతం బద్దలు కావడం వల్లనే మంటలు అంటుకుని ఉంటాయని అంచనా వేస్తున్నారు.
మంటలు అంతకంతకూ ఎక్కువ అవుతుండడంతో సహాయక చర్యలు తీసుకోవడం కూడా కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. కొందరు ప్రజలు తమ ఇళ్ళను వదలమని అంటున్నారు. పరిస్థితులను అర్ధం చేసుకోమని వాళ్ళకు అధికారులు నచ్చచెబుతున్నారు. మరో వైపు అక్కడ ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి. దీనివల్ల కూడా మంటలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటివరకూ ఎవరికీ ఏమీ జరగలేదు కానీ అరటి తోటలు, రోడ్లు, నీటి పారుదల వ్యవస్థ లాంటివి మంటల్లో నాశనం అయిపోయాయి. దాదాపు 3వేల భవనాలు అగ్నికి ఆహుతి అయ్యాయని అంటున్నారు అధికారులు.