స్కూల్ కింద 2వేల బాంబులు.. కొంచెంలో మిస్.. లేదంటే!
X
ఆ స్కూల్ లో వెయ్యి మందికి పైగా విద్యర్థులు ఉన్నారు. బిల్డింగ్ సరిపోవట్లేదని కొత్త బ్లాక్ కట్టేందుకు యాజమాన్యం నిర్ణయించింది. పునాదులు కూడా తవ్వింది. అంతలోనే ఓ వార్త కలకలం రేపింది. పునాదులు తవ్వుతుండగా ఒక్కటొక్కటిగా ఆయుధాలు, మందుపాతరలు, రాకెట్ లాంచర్లు మొత్తం 2వేలు బయటపడ్డాయి. భయాందోళనకు గురైన యాజమాన్యం అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు. తవ్వకాలు చేపట్టిన అధికారులు అసలు విషయం బయటపెట్టారు.
కంబోడియా ఈశాన్య ప్రాంతంలోని క్రాంటీ ప్రావిన్స్ లో క్వీన్ కోసామక్ హైస్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్రమత్తమైన కంబోడియన్ మైన్ యాక్షన్ సెంటర్ (సీఎంఏసీ) తవ్వకాలు జరిపింది. దాంతో 2116 పేలని బాంబులు లభించాయి. అందులో ఎం70 గ్రెనేడ్లు, ఫ్యూజ్‌ఎం48 బాంబులు, బీ40 రాకెట్ లాంచర్లు ఉన్నాయి. ఇవే కాకుండా స్కూల్ కింద మరిన్ని దొరికే ఛాన్స్ ఉన్నందున సీఎంఏసీ ఆ స్కూల్ కు కొన్నిరోజులు తాత్కాలిక సెలవులు ప్రకటించింది. అయితే. స్కూల్ కింద బాంబులు ఉండటంపై స్పందించిన సీఎంఏసీ.. అవి 1970లో జరిగిన కంబోడియన్ సివిల్ వార్ వని తేల్చింది. యుద్ధం సమయంలో సైన్యం ఆ ప్రాంతంలో బాంబులు దాచారని పేర్కొంది.