అది కెనడా కాదు మరో పాకిస్తాన్.. అక్కడ అసలేం జరుగుతోంది?
X
ఒక ఉగ్రవాది హత్యకు రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టేంత దృశ్యముందా? రాయబారుల బహిష్కరణ, ట్రావెల్ అడ్వైజరీ, వీసాల నిలిపివేత వంటి కనీవినీ ఎరుగని కఠిన చర్యలు దారితీసేంత పరిస్థితి ఉందా? దేశంలోని హిందువులందరూ ‘తమ దేశం’ నుంచి వెంటనే వారికి మూలదేశమైన భారతదేశానికి వెళ్లిపోవాలని ఉగ్రవాదులు హెచ్చరించేంతగా మైత్రీ సంబంధాలు దెబ్బతిన్నాయా? కెనడాలో కొన్నాళ్లుగా సాగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. అందుకే కెనడా భారత్ పాలిట మరో పాకిస్తాన్‌గా అవతరించిందని రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కెలో బల్లమైన పాకిస్తాన్‌కు గట్టిగా చెక్ పెట్టిన భారత్ ఇప్పుడు ఖండాల అవతల ఉన్న ‘మరో పాకిస్తాన్’ అంతు తేల్చడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని భావిస్తున్నారు.
ఖలిస్తాన్ ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు.. మరెన్నో..
కెనడాకు ఉపాధి కోసం వెళ్లిన సిక్కుల్లో కొందరు ఖలిస్తాన్ వేర్పాటువాదంపై ఆసక్తి చూపడంతో సమస్య మొదలైంది. భారత ప్రభుత్వం పంజాబ్ సహా దేశం నలుమూలల నుంచి ఖలిస్తాన్ తీవ్రవాదులను తరిమికొట్టడంతో కెనడా వారికి స్వర్గధామమైంది. ఆ దేశంలో భావప్రకటన స్వేచ్ఛను ఆసరాగా తీసుకుని సిక్కు ఉగ్రవాదులు భారత వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొందరు పైసా వసూళ్లు, డ్రగ్స్ వ్యాపారం వంటి సంఘవిద్రోహక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. కెనడా ఖలిస్తాన్ ముఠాలు భారత్‌లోనూ అలజడి రేపడానికి ప్రయత్నిస్తున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్న భారత ప్రభుత్వం కెనడాను మొదటినుంచీ హెచ్చరిస్తున్నా ఆ దేశం పెడచెవిన పెడుతూవస్తోంది. రెండు దేశాల మధ్య చిచ్చుపెట్టిన హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనడా సకాలంలో అప్పగించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని దౌత్యవర్గాలు చెబుతున్నాయి. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ నాయకుడైన నిజ్జర్ హత్యతో కెనడా గగ్గోలు పెట్టి భారత్‌పై నిందలు మోపింది. అతడు తమ వాంటెడ్ లిస్టులో ఉన్నాడని భారత్ లుకౌట్ నోటీసు జారీ చేసినా కెనడా అధికారులు అతణ్ని పట్టుకోవడానికి సహకరించలేదు. కెనడా ప్రభుత్వంలో పలువురు నేతలకు హైప్రొఫైల్ సిక్కులతో, సిక్కు క్రిమినళ్లతో సంబంధాలు ఉన్న సంగతి బహిరంగ సత్యమే. సిక్కు గ్యాంగ్‌స్టర్లు ఒకపక్క భారత వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తూ మరోపక్క పోటీ గ్యాంగులతో ఫైట్ చేస్తుంటారు. తరచూ హత్యలు మామూలే. ఈ ఏడాది మేలో వాంకోవర్‌లో అమర్‌ప్రీత్ సమ్రా అలియాస్ చిక్కీ అనే మాఫియా నేతను ప్రత్యర్థులు హతమార్చారు.
భారత వ్యతిరేకతే ఎజెండా..
భారత ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చిన పలువురు ఖలిస్తానీలు కెనడాలో తలదాచుకుంటున్నారు. అక్కడ స్వేచ్ఛాయుత వాతావరణ ఉండడంతో భారత్‌లోని తమ పావులను కదిలిస్తూ హత్యలకు పాల్పడుతున్నారు. గత ఏడాది కాంగ్రెస్ నేత, గాయకుడు అయిన సిద్దూ మూసేవాలను కెనడా గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ చంపినట్లు తెలుస్తోంది. పంజాబ్ రాష్ట్రాన్ని భారత్ నుంచి విడగొట్టి స్వతంత్రదేశంగా ప్రకటించుకునే అవకాశం వందకు వంద శాతం లేకపోవడంతో అసహనంతో అకృత్యాలకు పాల్పడుతున్నారు. యువతను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టి ‘ఖలిస్తాన్ నిప్పు’ను నిత్యం మండేలా చూస్తున్నారు. పసుప్పచ్చ జెండాలు పట్టుకుని నిరసనలు నిర్వహిస్తూ, భారత్‌లో ప్రజాస్వామ్యం లేదని, హక్కులను కాలరాస్తున్నారని ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. కెనడాలో ధనిక సిక్కులు వీరికి నిధులు అందిస్తున్నట్లు భారత్ అనుమానిస్తోంది. పాకిస్తాన్ కూడా కెనడా సహా పలు దేశాల్లోని ఖలిస్తాన్ గ్రూపులకు నిధులు అదిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. గుర్వంత్ సింగ్ బాత్, భాగత్ సింగ్ బ్రార్, మోనిందర్ సింగ్ బౌల్, సతీందర్ పాల్ సింగ్ గిల్ వంటి మంది మోస్ట్ వాంటెడ్‌లు కెనడాలో ఉన్నారని, వారిని పట్టుకుని అప్పగించాలని భారత ప్రభుత్వం కోరుతోంది. వరల్డ్ సిఖ్ ఆర్గనైజేషన్, ఖలిస్తాన్, టైగర్ ఫోర్స్, సిఖ్స్ ఫర్ జస్టిస్, బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ తదితర సంస్థ నాయకులు పాక్ నాయకత్వంలో పనిచేస్తున్నారని చెెబుతోంది.
సిక్కుల హాట్‌స్పాట్‌గా కెనడా
తమ మత సంప్రదాయాల విషయంలో కఠినంగా ఉండే సిక్కులు తమ మతస్తులు ఎక్కవగా ఉన్న ప్రాంతాల్లో స్థిరపడడానికి, నివసించడానికి ప్రధాన్యమిస్తారు. కెనడాలో 14 లక్షల మంది భారతీయులు ఉండగా వరిలో సగానికిపైగా 7.7 లక్షల మంది సిక్కులే అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 3.7 కోట్ల కెనడా జనాభాలో సిక్కుల వాటా 2 శాతం. భారత జనాభాలో సిక్కుల వాటా 1.7 శాతం. కెనడాలోని భారత అనుకూల హిందువులను సిక్కులు తమ శత్రువులు భావించే ధోరణి ఇటీవల బాగా పెచ్చరిల్లింది. హిందువులందరూ కెనడాను వదిలి వెళ్లాలని ఖలిస్తాన్ నేత సిక్స్ ఫర్ జస్టిస్ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరిస్తున్నాడు. అతడు బహిరంగ ప్రకటలు చేస్తున్నా కెనడా ప్రభుత్వం అతనిపై ఈగ వాలనివ్వడం లేదు. ‘భావప్రకటన స్వేచ్ఛ’ అంటూ వేర్పాటువాదులను వెనకేసుకొస్తోంది.
కొసమెరుపు
కెనడా ప్రభుత్వం ఖలిస్తాన్ వేర్పాటువాదుల ఉదారంగా వ్యవహరించడం ఆ దేశం వరకే పరిమితం కాదు. 2018లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత పర్యటనకు వచ్చినప్పుడు ఖలిస్తాన్ ఉగ్రవాది జస్పాల్ అత్వాల్‌ను విందుకు ఆహ్వానించాడు. 1986లో వాంకోవర్ వెళ్లిన అప్పటి పంజాబ్ మంత్రి మల్కియాత్ సింగ్ సిద్దుపై కాల్పులు జరిపిన కేసులో అత్వాల్ నిందితుడు.