Canadian Advisory: 'కెనడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి': అడ్వైజరీ జారీ
X
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదం నేపథ్యంలో... భారత్ నుంచి తమ 41 మంది దౌత్య వేత్తలను కెనడా ఉపసంహరించుకుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసిన కాసేపటికే... తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీ (Canada Advisory) జారీ చేసి మరోసారి కవ్వింపులకు పాల్పడింది. భారత్‌లోని పలు నగరాల్లో (Indian Cities) ఉన్న కెనడా వాసులు అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది.
ఇటీవలే చోటు చేసుకున్న పరిణామాలతో భారత మీడియా, సామాజిక మాధ్యమాల్లో కెనడాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అడ్వైజరీలో పేర్కొంది. ఈ క్రమంలోనే కెనడా పౌరులపై బెదిరింపులు, వేధింపులు జరగొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. అందువల్ల దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాలతోపాటు బెంగళూరు, చండీగఢ్, ముంబై నగరాల్లో ఉన్న కెనడియన్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఎవరూ తమ వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించింది. మరోవైపు సిబ్బందిని తగ్గించిన నేపథ్యంలో ముంబయి, బెంగళూరు, చండీగఢ్‌లో అన్ని రకాల ఇన్-పర్సన్ సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది.
ఈ నగరాల్లో వ్యక్తిగత వీసా (Visa), కాన్సులర్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని తెలిపింది. ఈ ప్రాంతాల్లోని కెనడియన్లు ఏదైనా అవసరమైతే దిల్లీలోని కెనడా హై కమిషన్‌ను సంప్రదించాలని సూచించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది.