’75 హార్డ్’ చాలెంజ్.. నీళ్లు తాగి ఆస్పత్రి పాలవుతున్న జనం..
X
టిక్‌టాక్ మన దేశంలో లేకపోయినందుకు ఒకందుకు మంచే జరిగింది! ఆ చైనా యాప్ ఉన్నప్పుడు జనం నానా చాలెంజ్‌లతో న్యూసెన్స్ చేయడమే కాకుండా ప్రాణాలమీదికి కూడా తెచ్చుకున్నారు. తాజాగా టిక్ టాక్‌లో ‘75 హార్డ్’ అనే చాలెంజ్ కూడా జనం కొంప ముంచుతోంది. పైకి తేలిగ్గానే కనిపించినా ఒంట్లోని శక్తినంతా పీల్చి పిప్పిచేసి ఆస్పత్రి పాలు చేస్తోంది. కెనడాకు చెందిన మిషల్ ఫైర్‌బర్న్ అనే మహిళ ఈ చాలెంజ్ జోలికి వెళ్లి తీవ్ర అనారోగ్యంపాలై ఆస్పత్రిలో చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఏమిటీ చాలంజ్
పేరులోనే ఉన్నట్లు ఇది 75 రోజుల సవాల్. ఇందులో పాల్గొనేవారు 75 రోజుల పాటు రోజుకు 4 లీటర్ల నీరు తాగాలి. మద్యం పుచ్చుకోవద్దు. ‘దొంగ తిండి’ తినొద్దు. రోజుకు 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఏదైనా పుస్తకంలో పది పేజీలు చదవాలి. చాలెంజ్ ప్రభావం ఎలా ఉందో జనానికి చూపడానికి రోజూ ఒక ఫొటో పెట్టాలి. ఆండీ ఫ్రిసెల్లా అనే యూట్యూబర్ ఈ దిక్కుమాలిన చాలెంజ్ ప్రారంభించారు.
మిషల్ కూడా ఈ చాలెంజ్ బావుందని పాల్గొంది. 12 రోజులకే ఆరోగ్యం దెబ్బతినింది. మంచీనీళ్లు ఎక్కువగా తాగడంతో శరీరంలో సోడియం స్థాయిలు దారుణంగా పడిపోయాయి. నీరసం, వాంతులు, తలనొప్పి మొదలయ్యాయి. ఏం తిన్నా సహించక కుప్పకూలి, ఆస్పత్రికి చేరుకుంది. ‘‘మంచినీళ్లు విషం అయ్యాయి. ఏం చేయాలో దిక్కు తెలియలేదు. చాలెంజ్ ఆరోగ్యానికి మేలు చేస్తుందనుకుంటే కొంప ముంచింది’’ అని చెప్పింది. సమస్య నుంచి కోలుకోవడానికి ఇకపై రోజూ అరలీటరు మాత్రమే తాగాలని డాక్టర్లు ఆమెకు సలహా ఇచ్చారు. శరీరంలో సోడియం నిల్వలు తగ్గిపోతే ప్రాణం కూడా పోతుందని, ఇలాంటి చాలెంజ్‌లు మంచివి కావని హెచ్చరించారు. 75 హార్డ్ చాలెంజ్‌లో పాల్గొన్న మరికొందరు కూడా తమకు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయని చెబుతున్నారు. డాక్టర్ సలహా తీసుకునే ఇందులో పాల్గొనాలని చాలంజ్ సృష్టికర్త ప్రిసిల్లా చెబుతున్నారు.