ఆ దేశంలోని భారతీయులు వెంటనే వచ్చేయండి.. కేంద్రం సూచన
X
ఆఫ్రికా దేశమైన నైజర్ను వీలైనంత త్వరగా విడిచి వెళ్లాలని అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులకు కేంద్రం సూచించింది. అలాగే అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఆ దేశానికి వెళ్లాలని ప్లాన్ చేసుకునే భారతీయులు తమ ప్లాన్ మార్చుకోవాలని కోరింది. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ సూచనలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నైజర్లో నివసించే భారతీయులు వీలైనంత త్వరగా వేరే దేశానికి చేరుకోవాలని సూచించింది. ప్రస్తుతం అక్కడి గగనతలం మూసేసి ఉన్న కారణంగా.. రోడ్వేను అనుసరించాలని కోరింది. సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నైజర్లో 250 మంది భారతీయులు ఉన్నారు. వారంతా తక్షణమే భారత ఎంబసీలో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
కాగా, ఆ దేశంలో సైనిక తిరుగుబాటు జెండా ఎగిరింది. ఇకపై దేశ వ్యవహారాలను తామే చూసుకుంటామని సైన్యం ప్రకటించింది. ప్రెసిడెన్షియల్ గార్డ్స్ సభ్యులు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్, ఆయన సతీమణిని నిర్బంధించారు. ప్రెసిడెన్షియల్ గార్డ్స్ జనరల్ ఒమర్ టిచనీని తొలగించాలని అధ్యక్షుడు బజౌమ్ నిర్ణయించడమే తిరుగుబాటుకు దారితీసినట్లు సమాచారం. అధ్యక్షుడు బజౌమ్ ఇస్లామిక్ మిలిటెంట్లపై పోరాటంలో పాశ్చాత్య దేశాలకు సహకరించడం కూడా దీనికి కారణంగా తెలుస్తోంది.
ఇకపై ఇతర దేశాల జోక్యాన్ని సహించబోమని సైన్యం ప్రకటించింది. దేశంలోని అన్ని సంస్థలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సరిహద్దులను మూసేసి కర్య్ఫూ విధించిన సైన్యం.. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. మరోవైపు సైనిక తిరుగుబాటుతో నైజర్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ప్రెసిడెంట్ బజౌమ్ పార్టీ కార్యాలయంపై తిరుగుబాటుదారులు దాడి చేశారు. ఆఫీస్ బయట ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. అయితే ఆందోళనకారు చేతుల్లో రష్యన్ ఫ్లాగ్స్ ఉండడ గమనార్హం.