చైనాలో జల ప్రళయం..40 వేల ఇళ్లు ధ్వంసం
X
చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నగరాలన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటిలో మునిగిపోయాయి. వరదలు బీభత్సం సృష్టించాయి. వరదలకు తోడు శక్తివంతమైన సుడిగాలి తోడవడంతో అక్కడి పరిస్థితులు అతి దారుణంగా మారాయి. దాదాపు 40 వేల ఇళ్లు ధ్వంసం కాగా, 39 లక్షల మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. మరోవైపు వరదల ప్రభావంతో 1.55 లక్షల ఇళ్లకు విద్యుత్ నిలిచిపోయి చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. డజన్ల కొద్దీ ప్రజలు తప్పిపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎటు చూసినా కన్నీటి కథలే కనిపిస్తున్నాయి. దీంతో గత్యంతరం లేక ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
వరదల్లో తప్పిపోయిన వారిని వెతికేందుకు ఇప్పటికే సహాయక చర్యలు మొదలయ్యాయి. ఈ వరదల్లో తప్పిపోయిన సుమారు 16 మంది కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వరద కోలుకోలేని విధ్వంసాన్ని సృష్టించింది. నగరాన్ని తిరిగి నిర్మించడానికి దాదాపుగా రెండేళ్లు పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. హెబీ ప్రావిన్స్‌లో ఏర్పడిన భీకరమైన టోర్నడో అనంతరం నగరం మొత్తం వరదల్లో చిక్కుకుపోయింది. టోర్నడో ప్రభావంతో బీజింగ్‌లో 140 ఏళ్లలో అత్యధిక వర్షాలు కురిశాయని నిపుణులు చెబుతున్నారు. బీజింగ్‌లో గత వారం రోజుల్లో వరద ఉధృతికి 33 మంది మరణించారు. ఈ నేపథ్యంలో నిరాశ్రయులైన ప్రజలకు తిరికి చలికాలం లోపు ఇళ్లను పునరుద్ధరించి అందించాని చైనా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇటు మయన్మార్‌లోనూ దారుణమైన పరిస్థితి నెలకొంది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాలు ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. 40 వేల మందికి పైగా ప్రజలు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. నగరంలో పలు సహాయక శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెస్క్యూ టీం సహాయక చర్యలు కంటిన్యూ చేస్తోంది.