China : సీక్రెట్‌గా ఆ ఆయుధాన్ని తయారు చేసిన చైనా
X
చైనా పరిశోధకులు తమ దేశం కోసం శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించి సరికొత్త ఆవిష్కరణలను చేపడుతున్నారు. తాజాగా తైవాన్ దేశాన్ని నాశనం చేయడానికి అత్యంత శక్తివంతమైన మైక్రోవేవ్ వెపన్‌ను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. కదిలే ట్రక్కు నుంచి ఏ ఇబ్బందులూ లేకుండా మైక్రోవేవ్ వెపన్‌ను ప్రయోగించేందుకు చైనా సిద్దమవుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతలను కొన్ని ఆయుధాలు తట్టుకోలేవు. అయితే ఎటువంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకునేవిధంగా చైనా తన ఆయుధాలను ఉత్పత్తి చేస్తోంది.
స్టీరింగ్ ఇంజిన్ల సాయంతో చైనా శాస్త్రవేత్తలు మైక్రోవేవ్ ఆయుధాన్ని తయారు చేశారు. ఇందుకోసం వారు థర్మల్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చడానికి నాలుగు కాంపాక్ట్ స్టీరింగ్ ఇంజిన్లను వినియోగించారు. డ్రోన్లు, యుద్ధ విమానాలు, ఉపగ్రహాల్లో సైతం వినియోగించే తరంగాలను ఈ ఆయుధం విడుదల చేస్తుందని నివేదికలో తెలిపారు. ప్రపంచంలోనే స్టీరింగ్ ఇంజిన్ సాంకేతికతతో రూపొందించిన తొలి ఆయుధం ఇదే కావడం విశేషం.
చైనా తయారు చేసిన ఆ ఆయుధం నాలుగు గంటల పాటు నిర్విరామంగా పనిచేస్తుంది. డ్రోన్ల గుంపును ఒక్కసారిగా మటుమాయం చేసే శక్తి ఈ మైక్రోవేవ్ వెపన్‌కు ఉంది. ప్రస్తుతం చైనా తయారు చేసిన ఆయుధం డ్రోన్లనే కాకుండా యుద్ధ విమానాలను, ఉపగ్రహాలను సైతం నిర్వీర్యం చేయగలదు. ఈ ఆయుధాన్ని ట్రక్కుల సాయంతో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. అయితే దీనిని పూర్తిస్థాయిలో వినియోగించడానికి మరికొంత సమయం పడుతుందని చైనా పరిశోధకులు తెలిపారు.