10వేల మీటర్ల లోతైన రంధ్రం తవ్వుతున్న చైనా
X
భూగర్భ అన్వేషణలో చైనా మరో ముందడుగు వేసింది. భూ గర్భంలోకి అత్యంత లోతైన రంధ్రం తవ్వకాన్ని ప్రారంభించింది. ఈ రంధ్రం సుమారు 10,000 మీటర్లు (32,808 ఫీట్ల) లోతు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మంగళవారం చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలో ఈ తవ్వకాన్ని మొదలుపెట్టారు. ఆ దేశం తవ్వుతున్న అత్యంత లోతైన రంధ్రంగా ఇది రికార్డు సృష్టించనుందని చైనాకు చెందిన షిన్హువా న్యూస్ ఏజెన్సీ చెప్పింది. ఈ డ్రిల్లింగ్ ప్రాజెక్టు అత్యంత కఠినమైనదని, ఓ భారీ ట్రక్కును రెండు సన్నటి తీగలపై నడిపించినట్లు ఉంటుందని చైనీస్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ సైంటిస్ట్ సున్ జింషెంగ్ చెప్పారు.
10 రాతి పొరలు చీల్చుతూ
చైనా తవ్వుతున్న రంధ్రం భూమి అడుగున దాదాపు 10 రాతి పొరలను చీల్చుకొంటూ సాగనుంది. ఇది దాదాపు 145 మిలియన్ సంవత్సరాల వయస్సున్న క్రెటెషియస్ పొరను చేరుకోనుంది. 2021లో భూగర్భ అన్వేషణను అభినందించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇవి ఖనిజ సంపద, ఇంధన వనరులను గుర్తించడంతో పాటు.. భూకంపాలు, అగ్నిపర్వతాల ముప్పును ముందే పసిగట్టగలుగుతుందని చెప్పారు. ప్రపంచంలోనే మానవులు తవ్విన అత్యంత లోతైన రంధ్రం రష్యాలో ఉంది. కోలా సూపర్ డీప్ బోర్‌హోల్‌గా పిలిచే ఈ రంధ్రం 12,262 మీటర్లు లోతు ఉంది. 20 ఏళ్ల పాటు బోర్ వేసి 1989లో ఈ లోతుకు చేరుకున్నారు.
రోదసిలోకి ముగ్గురు వ్యోమగాములు
మరోవైపు అంతరిక్ష కార్యక్రమంలోనూ చైనా కీలక ముందడుగు వేసింది. ఒకవైపు రంధ్రం తవ్వకం ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ ఇదే సమయంలో ముగ్గురు వ్యోమగాములను విజయవంతంగా రోదసిలోకి పంపింది. గోబి ఎడారి నుంచి చేపట్టిన ఈ ప్రయోగంలో దేశ తొలి పౌర వ్యోమగామి గుయ్ హైచావో కూడా భాగస్వాములయ్యారు. షెంజౌ-16 వ్యోమనౌకలో భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతరిక్ష కేంద్రంలోకి వీరు ప్రవేశించారు. ఈ ప్రయోగంతో భూమిపైనా.. భూగర్బంలో ఒకేసారి పరిశోధనలను చేపట్టడంలో చైనా ముందడుగు వేసినట్లైంది.