జాంబియాలో కలరా వ్యాధి విజృంభణ .. 412 మృతి
X
ఆఫ్రికా దేశం జాంబియాలో కలరా వ్యాధి విజృంభిస్తోంది. కలుషిత నీటిని సేవించడం వల్ల గత 4 నెలల్లోనే 7004 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటివరకు పది ప్రావిన్సుల్లోని 45 జిల్లాలకు కలరా పాకింది. దీనిని అడ్డుకోవడంలో హెల్త్ వర్కర్లు సతమతవుతున్నారు. తొలిసారిగా 1977లో ఇక్కడ కలరా వ్యాపించింది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సాయం కోసం జాంబియా ప్రభుత్వం అర్థించింది. దీంతో దేశ వ్యాప్తంగా పాఠశాలను మూసివేశారు. దేశ రాజధాని లూసాకాలో పుట్‌బాల్ స్టేడియాన్ని ఆస్పత్రిగా మార్చేసి రోగులకు వైద్యం అందిస్తున్నారు. జాంబియన్ ప్రభుత్వం సామూహిక టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. అలాగే దేశంలోని పలు కలరా పీడిత ప్రాంతాలలో రోజుకు 2.4 మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన నీటిని ప్రభుత్వం అందజేస్తోంది.
‘జాంబియా పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్’ తెలిపిన వివరాల ప్రకారం జాంబియాలో కలరా వ్యాప్తి గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఆ నెలలో కలరా కారణంగా 412 మంది మృతిచెందారు. అలాగే 10,413 కలరా కేసులు నమోదయ్యాయి. దేశంలోని 10 పది రాష్ట్రాలలో తొమ్మిది రాష్ట్రాలు కలరా బారిన పడ్డాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు రెండు కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో రోజుకు 400కు పైగా కలరా కేసులు నమోదవుతున్నాయి. కలరా అనేది నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది అపరిశుభ్రత కారణంగా వ్యాపిస్తుంది. కలుషిత నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల కలరా సోకుతుంది.
గత ఏడాది ఆఫ్రికాలోని మరో దేశమైన జింబాబ్వేలో కూడా కలరా వ్యాపించింది. ఇక్కడ కూడా స్వచ్ఛమైన తాగునీటి కొరత ఉంది. కలరా వ్యాపిస్తున్న మణికాలాండ్, మాస్వింగో రాష్ట్రాల్లో అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్య 50కి పరిమితం చేశారు.ఈ వ్యాధి మరింత ప్రబలకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ 10 లక్షల వ్యాక్సిన్లను పంపుతోంది. లక్ష్యం అనేది లేకుండా గ్రామీణులు పట్టణాలకు వలస వస్తుండటాన్ని అధ్యక్షుడు హకైండే హిచిలేమా ఆక్షేపించారు. అదే కలరా వ్యాధి వ్యాప్తికి కారణమన్నారు. పట్టణాల్లో కన్నా గ్రామాల్లోనే మంచినీరు, భూమి అందుబాటులో ఉంటుందని.. గ్రామాలకు తిరిగి వెళ్లిపోవాలని పిలుపునిచ్చారు. కలరా తమ దేశాలకు వ్యాపించకుండా పొరుగునే ఉన్న మొజాంబిక్, జింబాబ్వే దేశాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి.