బ్యూటీషియన్లకు షాకింగ్ న్యూస్..వాటి వల్ల క్యాన్సర్ ముప్పు
X
సుదీర్ఘకాలంగా సౌందర్య రంగంలో పనిచేస్తున్నారా? అయితే మీకు మూడినట్లే. అవును బ్యూటీషియన్లుగా, హెయిర్ డ్రెస్సర్లుగా పనిచేసే మహిళలకు అనుకోని ఆపద ముంచుకొస్తోంది. అందరినీ అందంగా తీర్చిదిద్దాలనుకునే వారు తమకు తెలియకుండానే అనుకోని విధంగా అండాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. సౌందర్యాన్ని మెరుగుపరిచేందుకు వినియోగించే కొన్నిరకాల పదార్థాల కారణంగానే మగువలు ఈ రకం క్యాన్సర్ బారిన పడుతున్నారని షాకింగ్ న్యూస్ చెప్పింది. బ్యూటీషియన్లు, హెయిర్ డ్రెస్సర్లకే కాదు ప్రాడక్ట్స్ సేల్ చేసేవారు, రిటైల్ రంగంలోని వారితో పాటు వస్త్ర తయారీ, నిర్మాణ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా ఈ క్యాన్సర్ ముప్పు ఉందని తెలిపింది. బ్యూటీ రంగంలో వాడే 29 రకాల కెమికల్స్‌కు, అండాశయ క్యాన్సర్ ముప్పుకు మధ్య ఉన్న సంబంధాన్ని ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
కెనడాకు చెందిన మాంట్రియల్ వర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు 1,388 మంది మహిళలపై స్టడీ చేశారు. 18-79 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిని పరిశీలించారు. వీరిలో దాదాపు 491 మంది మహిళలకు అండాశయ క్యాన్సర్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. హెయిర్ డ్రెస్సర్లు, బ్యూటీషియన్లుగా 10 ఏళ్లకుపైగా ఉన్న మహిళలకు ఈ అండాశయ క్యాన్సర్ ముప్పు మూడు రెట్లు ఎక్కువని తేలింది. ముఖ్యంగా మగువల అందాలను తీర్చిదిద్దేందుకు వాడే 13 రకాల రసాయనాలే వీరిని ఈ ముప్పుకు దగ్గర చేస్తున్నాయని శాస్త్రవేత్తలు నిర్థారించారు.
బ్యూటీషియన్లు, హెయిర్ డ్రెస్సర్లే కాదు, వస్త్ర పరిశ్రమలో సుదీర్ఘకాలంగా పనిచేసినవారికి ఈ వ్యాధి ముప్పు 85 శాతం ఎక్కువగా ఉందని అధ్యయనం చెబుతోంది. సేల్స్ రంగంలో ఉన్న వారికి 45 శాతం, రిటైల్ రంగంలోనివారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం 59 శాతం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. టాల్కం పౌడర్, అమోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, హెయిర్ డస్ట్, సింథటిక్ ఫైబర్లు, అద్దకాలు, కలర్స్, సెల్యులోజ్, ఫార్మాల్డిహైడ్, ప్రొపెల్లెంట్ గ్యాస్, బ్లీచ్లలో లభించే రసాయనాల కారణంగా 8 ఏళ్లకుపైబడి ఈ రంగంలో పనిచేసే మహిళలకు 40 శాతం ముప్పు అధికంగా ఉంది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.