Home > అంతర్జాతీయం > వైద్య చరిత్రలో ఇదే మొదటిసారి..బ్రెయిన్ డెడ్ పేషెంట్‎కు పంది కిడ్నీ

వైద్య చరిత్రలో ఇదే మొదటిసారి..బ్రెయిన్ డెడ్ పేషెంట్‎కు పంది కిడ్నీ

వైద్య చరిత్రలో ఇదే మొదటిసారి..బ్రెయిన్ డెడ్ పేషెంట్‎కు పంది కిడ్నీ
X

మనిషి శరీరంలోని అవయవాల్లో అతి ముఖ్యమైనవి కిడ్నీలు. ఇవి పాడైతే మనిషి బతకడం కష్టం. కిడ్నీలు పని చేయడం ఆగిపోతే .. జీవితాంతం డయాలసిస్ చేయించుకోవడం లేదా కిడ్నీ ట్రాన్స్‎ప్లాంటేషన్ చేయించాల్సి ఉంటుంది. కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. పైగా కిడ్నీ డోనర్లు కూడా ముందుకు రావాలి . సమయానికి డోనర్లు దొరికితేనే ప్రాణాలు నిలుపుకోవచ్చు. కొన్నిసార్లు కిడ్నీ దానం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. అందుకే వైద్యులు బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి అవయవాలను సేకరించి మాత్రమే అవసరమైన పేషెంట్లకు ట్రాన్స్‌ప్లాంట్ చేస్తుంటారు. ఈ క్రమంలో డోనార్ల కోసం వేచి చూసే పనిలేకుండా వైద్య చరిత్రలోనే మొదటిసారి అమెరికా వైద్యులు సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. మనిషి శరీరంలో పంది కిడ్నీని అమర్చారు. ఈ ప్రయోగంలో వైద్యులు విజయం సాధించారు. గత నెల రోజులుగా ఆ కిడ్నీ మానవ శరీరంలో సమర్థవంతంగా పని చేస్తోంది.





కిడ్నీ సమస్యతో బాధపడే పేషెంట్లు దాతల కోసం సుదీర్ఘ కాలం నిరీక్షించాల్సి వస్తోంది. ఈ వెయిటింగ్‎కు తెరదించాలనే ఉద్దేశంతో వైద్యులు మానవ కిడ్నీలకు ప్రత్యామ్నాయంగా జంతువుల కిడ్నీలను వినియోగించే విషయమై గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగాల్లో భాగంగానే న్యూయార్క్‎లోని ఎన్‌వైయూ లాంగోన్స్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్ బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి రెండు కిడ్నీలను తొలగించి పందికి జన్యుమార్పిడి చేసి కిడ్నీని అమర్చారు.




ఈ పంది కిడ్నీలు ఆ బాడీలో అమర్చిన వెంటనే అది యూరిన్‎ను ఉత్పత్తి చేయడం ప్రారంభించిందని పరిశోధకులు తెలిపారు. అయితే గతంలోనూ పంది కిడ్నీని మానవ శరీరంలో అమర్చారు. అయితే అప్పుడు ఆ కిడ్నీ రెండు రోజులకు మించి పని చేయలేదు. కానీ ఇప్పుడు ఈ కిడ్నీ గత నెల రోజులుగా సమర్థవంతంగా పని చేస్తోందని ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ మాంట్‌గోమెరీ తెలిపారు. దీంతో మరింత ఉత్సాహంతో వైద్యులు పరిశోధనలు జరుపుతున్నారు. రానున్న రోజుల్లో పందుల కిడ్నీలు మనుషుల ప్రాణాలను నిలబెడతాయని వైద్యులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా అవయవాల కొరతను తీర్చడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు.



Updated : 17 Aug 2023 8:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top