Elon Musk : తొలిసారి మెదడులో చిప్.. షాకింగ్ విషయం చెప్పిన ఎలోన్ మస్క్
X
మనిషికి, కంప్యూటర్‌కు మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను కలిపేందుకు టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ప్రయోగాలు ప్రారంభించారు. ఇందుకోసం 2016లోనే ఆయన న్యూరో టెక్నాలజీ అనే కంపెనీని మొదలుపెట్టారు. తాజాగా ఆ ప్రయోగానికి సంబంధించిన కీలక విషయాలను మస్క్ తెలిపారు. తమ కంపెనీ కీలకమైన ప్రయోగాన్ని చేపట్టిందని, మనిషి మెదడులో న్యూరాలింక్ చిప్‌ను మొట్టమొదటిసారిగా అమర్చామన్నారు.
తాము చేపట్టిన ప్రయోగం ఆశాజనకంగా ఉందని, మంచి ఫలితాలను కూడా అందిస్తోందని మస్క్ తెలిపారు. నిన్న తొలిసారి మనిషి మెదడులో న్యూరాలింక్‌ను అమర్చామని, ప్రస్తుతం ఆ పేషెంట్ కోలుకుంటున్నాడని అన్నారు. ఆ చిప్ ద్వారా మెదడులోని నాడీ కణాలను గుర్తించడం కచ్చితంగా కనిపిస్తోందన్నారు. మనిషి సామర్థ్యాలను ఉత్తేజం చేయడం, నాడీ సంబంధిత వ్యాధులకు చికిత్స చేయడంలో ఈ చిప్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు.
మనిషి మెదడులో చిప్‌ను అమర్చేందుకు అమెరికా నియంత్రణ సంస్థ నుంచి గత ఏడాదే తమకు అనుమతులు లభించాయన్నారు. అందుకే తాము ప్రయోగాన్ని చేపట్టామన్నారు. 5 నాణేల పరిమాణంలో ఉన్నటువంటి చిప్‌ను సర్జరీ చేసి మనిషి మెదడులో అమర్చినట్లు మస్క్ తెలిపారు. త్వరలోనే ఈ ప్రయోగానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు. కాగా న్యూరాలింక్ కంపెనీ కాలిఫోర్నియాలో ఉంది. ఇందులో 400 కంటే ఎక్కువ మంది పనిచేస్తుండగా మెదడులో చిప్ అమర్చే ప్రయోగాల కోసం ఈ కంపెనీ 363 మిలియన్ డాలర్ల నిధులను సేకరించినట్లు తెలిపింది.